Loading...
Multi Starrer : చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్‌?.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా!
చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్‌?.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా!

Multi Starrer : చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్‌?.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వీరి అనుబంధం అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పడినా, అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరిగినా.. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మెలుగుతుంటారు. అయితే ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పటివరకు ఒకే సినిమాలో కలిసి నటించకపోవడం అభిమానులను ఎప్పుడూ నిరాశపరిచిన విషయమే. ఇప్పుడు మాత్రం ఆ కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాలు

మరో భారీ మల్టీస్టారర్‌ కు ప్లాన్

ప్రస్తుతం వరుస విజయాలతో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి మరో భారీ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వెంకటేష్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన, ఆ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి-నాగార్జున కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ కూడా సిద్ధం చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వివరాలు

త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం

ఇటీవల విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు మరోసారి ఇద్దరు అగ్ర హీరోలను ఒకే తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

విభిన్నమైన వినోదాత్మక కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న అనిల్ రావిపూడి, చిరంజీవి-నాగార్జున ఇమేజ్‌కు తగ్గ కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం.

చిరంజీవి, నాగార్జున స్టార్‌డమ్‌కు అనిల్ రావిపూడి కామెడీ టచ్ జత కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT