TFC : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 6 "తెలుగు సినిమా దినోత్సవం"
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీనియర్ నటుడు మురళీమోహన్, ప్రముఖ రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, రచయిత, జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ఫిబ్రవరి 6ను అధికారికంగా "తెలుగు సినిమా దినోత్సవం"గా ప్రకటించింది.
వివరాలు
మేము సినిమా రంగానికి చెందిన వారమని గర్వంగా చెప్పుకునేవాళ్లం: మురళి మోహన్
ఈ సందర్భంగా సినీ ప్రముఖుడు మురళీమోహన్ మాట్లాడుతూ, "రాజకీయ నాయకుల కంటే సినీ నటులకే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంటుంది. రాజకీయ నాయకుడి పదవీ కాలం ముగిసిన తర్వాత అతనిపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతుంది. క్రీడాకారులకూ కేవలం కొంత కాలం మాత్రమే ప్రజాదరణ ఉంటుంది. కానీ సినీ నటులు మాత్రం ప్రజల మనసుల్లో సుస్థిరంగా ఉంటారు. ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా జరుపుకోవడం మాకు గర్వకారణం. మద్రాసులో ఉన్న రోజుల్లో, మేము సినిమా రంగానికి చెందిన వారమని గర్వంగా చెప్పుకునేవాళ్లం" అని అన్నారు.
ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రత్యేక అవార్డులు అందజేయాలని నిర్ణయించారు.
వివరాలు
పరిచూరి గోపాలకృష్ణకు జెండా రూపకల్పన బాధ్యత
ఇవి ఫిబ్రవరి 6న, తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా అందజేయాలని నిర్ణయించారు.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అందించే సినీ పురస్కారాలతో పాటు, ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా ప్రత్యేక అవార్డులు ఉంటాయని స్పష్టం చేశారు.
తెలుగు సినిమా పుట్టిన రోజును పురస్కరించుకుని, ప్రతి సినీ నటుడి ఇంటివద్ద, అలాగే థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు.
ఈ ప్రత్యేక జెండా రూపకల్పన బాధ్యతను రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్టు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది.