AP Movie Ticket Prices: ఏపీలో సినిమా టికెట్ ధరలపై కొత్త పాలసీ?.. నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలంటే ప్రతిసారి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి త్వరలో ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెటింగ్ విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిర్మాతలు, పంపిణీదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా కొత్త జీవోను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ సినిమా టికెట్ ధరలను పెంచాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు, భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపునకు ప్రత్యేక జీవోలు జారీ చేయాల్సి వస్తోంది. దీంతో ప్రతి పెద్ద సినిమా విడుదలకు ఇదే ప్రక్రియ పునరావృతమవుతుండటంతో ప్రభుత్వంపైనా అదనపు పరిపాలనా భారం పడుతోంది.
వివరాలు
కొన్ని మార్పులుండే అవకాశం
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే తెలంగాణలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అక్కడ ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం లేకుండానే నిర్దేశించిన పరిమితుల మేరకు నిర్మాతలు టికెట్ ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది.
ఇదే తరహా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీలో అమలు చేయబోయే విధానంలో కొన్ని మార్పులు ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చర్చల్లో ఉన్న ప్రతిపాదన ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించే పరిధిలో నిర్మాతలు, పంపిణీదారులే టికెట్ ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించవచ్చని సమాచారం.
వివరాలు
కొత్త జీవోపై సానుకూల స్పందన
ఇందుకోసం టికెట్ ధరలను రూ.100 నుంచి రూ.1000 మధ్య నిర్ణయించేలా ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇటీవల స్పందించారు.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కొత్త జీవో తీసుకురావడంపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోందని చెప్పారు.
అయితే ఈ విధానం అమల్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
అధికారిక ఆమోదం అనంతరం మాత్రమే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
ప్రభుత్వ అనుమతులు కోరే అవకాశం ఉండదు
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే సినిమా పరిశ్రమకు పరిపాలనా పరంగా గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉంది.
ప్రతి సినిమా విడుదలకు ముందు టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వ అనుమతులు కోరాల్సిన అవసరం తగ్గుతుంది.
ప్రభుత్వం నిర్దేశించే నిబంధనల పరిధిలో నిర్మాతలు, పంపిణీదారులే ధరలను నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది.
అయితే ఈ కొత్త విధానం వల్ల ప్రేక్షకులపై ఎంత మేర ధరల భారం పడుతుంది? ప్రభుత్వం గరిష్ఠ టికెట్ ధరను ఎంతగా నిర్ణయిస్తుంది? వంటి అంశాలపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక జీవో విడుదలయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.