అనుష్క అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ 51లక్షలకు టోపీ వేసిన దుండగుడు
ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడ మోసం ఉంటుందనేది అక్షరాలా నిజం. ఇండస్ట్రీ మీద అవగాహన లేక సినిమా పరిశ్రమలో వెలుగు వెలగాలని ఎంతో ఆశతో వచ్చిన వాళ్ళు, మోసగాళ్ల చేతుల్లో పడి అన్నీ కోల్పోతుంటారు. అలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమా మీద మక్కువతో, తానే ఓ సినిమా నిర్మించాలని ఇండస్ట్రీకి వచ్చిన లక్ష్మాచారి అనే వ్యక్తికి ఎల్లారెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. హీరోయిన్ అనుష్క శెట్టి, తనకు బాగా తెలుసంటూ ఏవేవో మాటలు చెప్పిన ఎల్లారెడ్డి, అనుష్క శెట్టి డేట్లు ఇప్పిస్తానని, అనుష్కతో సినిమా చేసుకోవచ్చని లక్ష్మాచారిని నమ్మించాడు. అలాగే అనుష్కకు అడ్వాన్స్ ఇవ్వాలని ముందుగా 26లక్షలు లక్ష్మాచారి నుండి తీసుకున్నాడట.
రేప్ కేస్ పెట్టిస్తానంటూ బెదిరించిన ఎల్లారెడ్డి
మొదటి సారి 26లక్షలు ఇచ్చిన లక్ష్మాచారి, ఆ తర్వాత మణిశర్మతో సంగీతం చేయిద్దామని ఎల్లారెడ్డి చెప్పడంతో మిగతా డబ్బు కూడా ఇచ్చాడట. అలా మొత్తం 51లక్షలు ఎల్లారెడ్డికి ముట్టచెప్పాడట. రోజులు గడుస్తున్నా అనుష్కతో అపాయింట్మెంట్ లేకపోవడంతో, సినిమా వద్దనీ, డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని లక్ష్మాచారి అన్నాడట. మొదట్లో డబ్బులు ఇచ్చేస్తానని చెప్పిన ఎల్లారెడ్డి, కొన్ని రోజుల తర్వాత మాట మారుస్తూ, ఊరికే ఫోన్ చేయొద్దని, ఒకవేళ చేస్తే ఇంట్లోని ఆడవాళ్ళతో లక్ష్మాచారి మీద రేప్ కేస్ పెట్టిస్తానని బెదిరించాడట. దాంతో ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు లక్ష్మాచారి. కేస్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతూనే ఉంటారు.