Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై దాడి కేసులో ట్విస్ట్.. అనిల్ పండిట్ మరదలు అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ మరదలు సునైనాను పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో అనిల్ పండిట్ సోదరుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన నగదు లావాదేవీల్లో అనిల్ పండిట్ మరదలు, సోదరుడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసుల అనుమానం. 32 ఏళ్ల అనిల్ పండిట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో టైగర్ ష్రాఫ్‌పై దాడికి బాధ్యత వహిస్తున్నట్లు కూడా అతడు ప్రకటించాడు.
వివరాలు
అమెరికాలో ఉంటూ గ్యాంగ్ కార్యకలాపాలు?
అనిల్ పండిట్ హరియాణాకు చెందినవాడు. 2023 నుంచి అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం.
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు కీలక అనుచరుడిగా ఉన్న అతడే టైగర్ ష్రాఫ్‌పై దాడికి ప్రణాళిక రచించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
భారత్‌లో పలు హైప్రొఫైల్ కాల్పుల ఘటనల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
విదేశాల్లో ఉంటూనే తన గ్యాంగ్‌కు సంబంధించిన కార్యకలాపాలను, ముఖ్యంగా బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసే దందాను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఇప్పటివరకు 13 మంది అరెస్ట్
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేసింది.
వీరిలో కాల్పులకు పాల్పడిన ఇద్దరు షూటర్లతో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తి కూడా ఉన్నారు.
వీరు రైలు మార్గంలో ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు.
ఈ కేసులో ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధ, బబిత, కునాల్, సుమిత్ అనే నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హరియాణాలోని సోనిపట్‌లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నిందితులకు అవసరమైన లాజిస్టికల్ సహకారం అందించడంతో పాటు ఆర్థికంగా సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు
అసలు కాల్పుల ఘటన ఎలా జరిగిందంటే?
అక్టోబర్ 18న ముంబయిలోని జుహులో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుట్‌బాల్ మైదానం నుంచి టైగర్ ష్రాఫ్ తన కారులో బయటకు వస్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఈ దాడిలో నటుడు ఎలాంటి తీవ్ర గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే ఆయన కారు డ్రైవర్‌తో పాటు ఓ అభిమాని గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ మాత్రమే అసలైన 'టైగర్' అంటూ గతంలో టైగర్ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు గ్యాంగ్ పేర్కొన్నట్లు సమాచారం.