Sabdham : ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ 'శబ్ధం' వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'శబ్దం'. టాలెంటెడ్ డైరెక్టర్ అరివజగన్ వెంకటాచలం, ప్రముఖ హిట్ మూవీ వైశాలి ఫేమ్, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పుడు మేకర్స్ చాలా రోజుల తర్వాత సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు. శబ్దం సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
భయపెట్టేందుకు సిద్ధమైన 'శబ్దం'
ఇందులో భయం శబ్దం భయపెట్టించేందుకు వస్తోంది అనే ట్యాగ్‌లైన్ తో ఆసక్తిని రేకెత్తించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి లైలా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమెతో పాటు సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శబ్దం మూవీని 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైశాలి తర్వాత ఆది పినిశెట్టి, అరివజగన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.