
Aamir Khan: 'సితారే జమీన్ పర్' విడుదల ముందు ఆమిర్ ఖాన్ తీసుకున్న కొత్త నిర్ణయాలు వైరల్ !
ఈ వార్తాకథనం ఏంటి
ప్రచార కార్యక్రమాల్లో ఎప్పుడూ ప్రత్యేకత కనబరిచే బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఇప్పుడు తన కొత్త సినిమా 'సితారే జమీన్ పర్' నేపథ్యంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుండటంతో, ఆమిర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఆమిర్ వరుస ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఆయన తీసుకున్న కొన్ని చర్యలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వివరాలు
ప్రదర్శనపై థియేటర్ కు మార్గదర్శకాలు
ఈ సినిమా విషయంలో ఆమిర్ ఖాన్ కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించినట్లు సమాచారం. ఉదయం 9 గంటలకుముందు ఈ సినిమాను ప్రదర్శించవద్దని, తెల్లవారుజామున 4 గంటల సమయంలో షోలు వేయకూడదని స్పష్టంగా తెలిపారు. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు తెలియజేశారు. అలాగే, టికెట్ ధరల విషయంలోనూ ఆమిర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూసే అవకాశం పొందేలా ధరలు అందుబాటులో ఉండాలని సూచించారు. వారాంతాల్లో మాత్రమే ధరలను కొద్దిగా పెంచుకోవచ్చని చెప్పినా, అవి కూడా ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఉండాలన్నది ఆయన అభిప్రాయం.
వివరాలు
సింగిల్ స్క్రీన్‌లపై ప్రత్యేక దృష్టి
ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్‌ల విషయానికి వస్తే, అవి 'సితారే జమీన్ పర్'కే ప్రత్యేకంగా కేటాయించబడాలని, రోజంతా ఇదే చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించాలని సూచించారు. అదే సమయంలో వేరే సినిమాలను ప్రదర్శించరాదని తెలియజేశారు. ఓటీటీలో విడుదలపై స్పష్టత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలన్న ఆలోచన ఆమిర్ వద్ద లేదని ఇప్పటికే కొన్ని వార్తల ద్వారా బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ.120 కోట్ల భారీ ఆఫర్ పెట్టిందని సమాచారం. అయితే ఆమిర్ ఈ డీల్‌ను అంగీకరించకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
వివరాలు
యూట్యూబ్ ద్వారా సినిమాను ఉచితంగా ఇవ్వాలన్న ఆలోచన
ఓటీటీలో కాకుండా, ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమాను ఆమిర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులోకి తేనున్నారని సమాచారం. ప్రేక్షకులందరికీ సినిమా చేరేలా చేయాలన్న ఉద్దేశంతో చిత్రబృందం ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది.