Actor Ravi: ఇంటి సిబ్బందిని నిర్బంధించినట్లు నటుడు రవి మోహన్‌పై ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ తన నివాసంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు, ఒక బాలుడిని నిర్బంధించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని నీలాంగరై ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లో నగదు, నగలు కనిపించకుండా పోయాయని అనుమానిస్తూ వారిని అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇంటి పనులకు వెళ్లిన తన భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త రవి మోహన్ నివాసానికి వెళ్లాడు. అక్కడ తన భార్యను ఇంట్లోనే ఉంచిన విషయం తెలుసుకుని, ఆమెను ఇంటికి పంపించాలని కోరినట్లు సమాచారం. అయితే, అందుకు రవి మోహన్ అంగీకరించలేదని చెబుతున్నారు.
వివరాలు
రంగంలోకి దిగిన పోలీసులు..
దీంతో ఆ మహిళ భర్త నీలాంగరై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రవి మోహన్ ఇంటికి చేరుకుని, ఎవరినైనా వ్యక్తిగతంగా నిర్బంధించడం చట్టబద్ధం కాదని సూచించారు. అనంతరం అక్కడ ఉన్న మహిళలను విడుదల చేయించారు. అలాగే, ఇంట్లో చోరీ జరిగినట్లయితే దానికి సంబంధించిన అధికారిక ఫిర్యాదును పోలీసులకు ఇవ్వాలని రవి మోహన్‌కు సూచించినట్లు సమాచారం.