రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటున్న సుహాస్
కలర్ ఫోటో సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి హిట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టైటిల్ పోస్టర్ లో బ్యాండ్ ని చేతపట్టుకుని సుహాస్ కనిపించాడు. తనతో పాటు మరో నలుగురు కూడా పోస్టర్ లో ఉన్నారు. పుష్ప ఫేమ్ జగదిష్ ప్రతాప్ కూడా ఆ నలుగురిలో ఒకడిగా ఉన్నాడు.అలాగే మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ గోపరాజు రమణ ఉన్నారు.
కామెడీ ప్రధానంగా రూపొందుతున్న చిత్రం
టైటిల్ పోస్టర్ చూస్తుంటే కామెడీ ప్రధానంగా తెరకెక్కుతోన్న చిత్రంలా కనిపిస్తోంది. ఐదుగురు బ్యాండ్ మేళం బ్యాచ్ అంతా కలిసి చేసే అల్లరి ఈ సినిమాలో కనిపించనుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోంది. గీతా ఆర్ట్స్2 బన్నీవాసు, మహాయాన మోషన్ పిక్చర్స్ వెంకటేష్ మహా సమర్పకులుగా ఉన్నారు. ఈ సినిమాతో దుష్యంత్ కటికినేని దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాబోతున్నాడు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది వెల్లడి చేయలేదు. మరికొద్ది రోజుల్లో టీజర్ ని రిలీజ్ చేస్తారని సమాచారం.