Anil Ravipudi: అనిల్ రావిపూడి కొత్త సినిమా రీమేక్ కాదా? వైరల్ వార్తలపై కీర్తి సురేశ్ స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే చిత్రాలతో ముందుకు వస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మరో వినోదాత్మక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ఓ మలయాళ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టగా, నటి కీర్తి సురేశ్ వాటికి స్వయంగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం #VenkyAnil5 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మరోవైపు కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా కనిపించనున్నారు.
వివరాలు
ఆ ప్రచారంలో వాస్తవం లేదు..
ఇదిలా ఉండగా, ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఈ సినిమా 2024లో విడుదలైన మలయాళ హాస్య చిత్రం 'గురువాయూర్ అంబలనాదయిల్'కు రీమేక్ అని పేర్కొంటూ ఓ పోస్టు చేసింది. ఆ పోస్టును గమనించిన కీర్తి సురేశ్ వెంటనే స్పందించి, అందులో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారానికి తెరపడినట్లైంది. ఇటీవలే ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అధికారికంగా షూటింగ్ ప్రారంభించారు. రాయలసీమ నేపథ్యంలో అనిల్ రావిపూడి ప్రత్యేక శైలిలో హాస్యం, వినోదం ప్రధానంగా సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.