LOADING...
Mumaith Khan: తలలో తొమ్మిది టైటానియం ప్లేట్లు,ఫిట్స్,డిప్రెషన్.. జీవితాన్ని ఎలా తిరిగి గెలిచిందో చెప్పిన ముమైత్ ఖాన్
జీవితాన్ని ఎలా తిరిగి గెలిచిందో చెప్పిన ముమైత్ ఖాన్

Mumaith Khan: తలలో తొమ్మిది టైటానియం ప్లేట్లు,ఫిట్స్,డిప్రెషన్.. జీవితాన్ని ఎలా తిరిగి గెలిచిందో చెప్పిన ముమైత్ ఖాన్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 28, 2026
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" పాటతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ముమైత్ ఖాన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, వాటిని అధిగమించిన విధానం గురించి హృదయాన్ని తాకే విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ముమైత్ ఖాన్ మాట్లాడుతూ, గతంలో తన మెదడులోని ఒక నరం దెబ్బతినడంతో అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ ఆపరేషన్‌లో భాగంగా తలలో తొమ్మిది టైటానియం ప్లేట్లు అమర్చారని చెప్పారు.

వివరాలు

భరించలేని మైగ్రేన్ తలనొప్పులు..

శస్త్రచికిత్స అనంతరం తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కొన్నానని, తరచూ ఫిట్స్‌కు సమానమైన సీజర్ ఎటాక్స్, భరించలేని మైగ్రేన్ తలనొప్పులు వేధించేవని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రతతో పాటు దీర్ఘకాలం వాడాల్సి వచ్చిన బలమైన మందుల ప్రభావం వల్లే తాను డిప్రెషన్‌కు గురయ్యానని ఆమె వివరించారు. "నేను స్వచ్ఛందంగా డిప్రెషన్‌లోకి వెళ్లలేదు. చికిత్సలో భాగంగా తీసుకున్న మందుల ప్రభావమే నా మానసిక స్థితిని మార్చింది" అని ఆమె తెలిపారు. ఆ క్లిష్ట సమయంలో తన ఆలోచనా విధానమే తనకు బలమైందని చెబుతూ, జీవితంలో ఒక దశలో తీవ్ర మానసిక వేదన అనుభవించినప్పటికీ, తన మనసును తానే నియంత్రించుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

వివరాలు

బాధను జయించినప్పుడే బలంగా ఎదుగుతాం..

తన జీవితంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, వాటితో పోలిస్తే డిప్రెషన్ అనేది తాత్కాలిక దశ మాత్రమేనని తనకు తానే ధైర్యం చెప్పుకున్నానని వెల్లడించారు. జీవితాన్ని వివరిస్తూ ముమైత్ ఖాన్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. గుండె స్పందన గ్రాఫ్ ఎప్పుడూ పైకి, కిందికి కదులుతూ ఉండటంలాగానే జీవితం కూడా ఒడిదుడుకులతోనే సాగుతుందని అన్నారు. ఎప్పుడూ విజయాలే ఉంటే కొత్త అనుభవాలు, కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం ఉండదని, కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవిత విలువ అర్థమవుతుందని, బాధను జయించినప్పుడే మనిషి మరింత బలంగా ఎదుగుతాడని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

వివరాలు

నిరంతరం ముందుకు సాగడమే జీవితం..

తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, విజయాలను ప్రసాదించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లే, డిప్రెషన్, బ్రెయిన్ సర్జరీ వంటి చేదు అనుభవాలను కూడా ఆశీర్వాదాలుగానే భావిస్తున్నానని ముమైత్ ఖాన్ అన్నారు. ఎందుకంటే ఆ అనుభవాలే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఈరోజు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా సెమినార్లు నిర్వహించే స్థాయికి తీసుకువచ్చాయని చెప్పారు. మంచి, చెడు, అత్యంత క్లిష్టమైన పరిస్థితులు కూడా జీవితంలో ఒక పాఠమేనని, ప్రతి అనుభవం మనిషిని మరింత దృఢంగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను వెనక్కి తగ్గబోనని, నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటానని ఆమె ధైర్యంగా తెలిపారు.

Advertisement