రామ్ చరణ్ నిర్మాతగా అక్కినేని అఖిల్ సినిమా?
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమాతో ఏప్రిల్ 28వ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని అఖిల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. 80కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, కనీస వసూళ్ళను కూడా సంపాదించలేకపోయింది. ఫలితంగా అఖిల్ కెరీర్లో మరో అపజయంగా మిగిలింది. ఏజెంట్ సినిమా ఫెయిల్యూర్ పై అఖిల్ స్పందిస్తూ, ప్రేక్షకులు అనుకున్న విధంగా సినిమాను తీయలేకపోయామని, మరోసారి అందరినీ సంతృప్తి పరిచే విధంగా సినిమా తీసేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. అయితే తాజాగా అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమా, రామ్ చరణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ లో ఉండబోతుందని సమాచారం వస్తోంది.
కొత్త ప్రొడక్షన్ హౌస్ లో కొత్త వాళ్లకు అవకాశం
యూవీ క్రియేషన్స్ బ్యానర్ విక్రమ్ తో కలిసి వీ మెగా పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించబోతున్నాడు రామ్ చరణ్. ఈ బ్యానర్లో మొదటి సినిమాను అక్కినేని అఖిల్ తో తెరకెక్కించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త పై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. రామ్ చరణ్, విక్రమ్ ప్రారంభిస్తున్న వీ మెగా పిక్చర్స్ బ్యానర్ లో కొత్త వాళ్లకు, కొత్త టాలెంట్ కు అవకాశం ఉంటుందని, అలాగే ఈ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతాయని వార్తలు వచ్చాయి. అదలా ఉంచితే, 2017లో కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.