Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్.. పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించే ప్లాన్!
డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఆయన అరెస్ట్ కాగా, హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తాజాగా ఈ బెయిల్ రద్దు చేసే అవకాశాలపై చర్చ నడుస్తోంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ టీంకు థియేటర్ సందర్శనకు ముందుగా అనుమతి ఇవ్వలేదని ఓ పోలీస్ నివేదిక బయటకు వచ్చింది.
పోలీసులు విఫలమయ్యారని చర్చ
ఈ నివేదిక ఆధారంగా అల్లు అర్జున్‌కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని పోలీసుల యత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు సమాచారం. ఈ కేసులో అల్లు అర్జున్ తప్పేం లేదని, పోలీసులే విఫలమయ్యారని మరోవైపు చర్చ జరుగుతోంది. థియేటర్ వద్ద అభిమానుల తాకిడి భారీగా ఉండడంతో పోలీసులు పరిస్థితిని సమర్థంగా హ్యాండిల్ చేయలేకపోయారని పలువురు విమర్శిస్తున్నారు. పోలీసుల తదుపరి చర్యలతో ఈ కేసు మరింత వివాదాస్పదం అవుతుందా..? లేదా అన్నది వేచి చూడాలి.