Allu Aravind: అల్లు అర్జున్ తరఫున వచ్చా.. బాధితులను ఆదుకుంటాం: అల్లు అరవింద్
హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెళ్లి సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఆ ప్రమాదంలో శ్రీతేజ్ తల్లి రేవతి మరణించగా, బాలుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అల్లు అరవింద్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి, భరోసా కల్పించారు. తాము బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అల్లు అరవింద్ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం లభించిందని తెలిపారు. కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా రావడం సాధ్యపడలేదని, అతని తరఫున తాను ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. .
ముందుకొచ్చిన పలువురు సినీ ప్రముఖులు
ఈ ఘటనకు కారణమైన ఘటనలపై విచారణ కొనసాగుతుండగా, పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ హాజరుకావడంతో అభిమానుల రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ప్రమాదంలో రేవతి ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక బాలునికి అప్పటినుంచి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా మద్దతు ఇస్తామని పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు