Pankaja Short Film: ఆస్కార్ బరిలో మరో తెలుగు అమ్మాయి.. 'పంకజ'కు అరుదైన గౌరవం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ పురస్కారాల బరిలో మరో భారతీయ లఘుచిత్రం నిలిచింది. ఇప్పటికే భారతీయ చిత్రాలు 'గోంధల్', 'అంగ్' ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో పరిశీలనకు ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ-తెలుగు లఘుచిత్రం 'పంకజ' కూడా ఆస్కార్ అకాడమీ పరిశీలనకు అర్హత సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనూయ స్వామితో పాటు ప్రధాన పాత్రలో నటించిన హర్షిణి బోయళ్ల కూడా తెలుగువారే కావడం విశేషం. వీరిద్దరూ బెంగళూరులో పుట్టి పెరిగారు.
వివరాలు
మురికివాడ కుటుంబాల నేపథ్యంలో..
బెంగళూరులోని ఓ మురికివాడలో నివసించే కుటుంబాల జీవితాల ఆధారంగా 'పంకజ'ను తెరకెక్కించారు.
పంకజ అనే మహిళ.. కనిపించకుండా పోయిన తన భర్త కోసం కుమార్తెతో కలిసి వెతుకులాట సాగిస్తుంది.
ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలే చిత్ర కథాంశం. అధికారం ఉన్న వ్యక్తులు వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని సామాన్యులను ఎలా వేధిస్తున్నారనే అంశాన్ని ఇందులో చర్చించారు.
ఈ లఘుచిత్రం ప్రతిష్ఠాత్మక సన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు 40కి పైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
రెయిన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో విజేతగా నిలవడంతో ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది.
వివరాలు
స్టూడెంట్ ప్రాజెక్ట్‌గా మొదలై.. ఆస్కార్ వరకు!
న్యూయార్క్ యూనివర్సిటీలో అనూయ మీడియా ఆర్ట్స్ కోర్సు చదువుతున్న సమయంలో.. రెండో ఏడాది స్టూడెంట్ ప్రాజెక్ట్‌గా 'పంకజ'ను తెరకెక్కించారు.
ఇప్పుడు అదే చిత్రం ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించడం విశేషం.
ఈ లఘుచిత్రానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు హాలీవుడ్ నటులు స్పైక్ లీ, విలియం డఫోతో పాటు భారత్‌కు చెందిన ఆస్కార్ విజేత గునీత్ మోంగా ముందుకొచ్చారు.
వీరు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు.