Sonu Sood: విమాన భద్రత మరింత పటిష్ఠం చేయాలి.. ఫ్లైదుబాయ్ ఘటనపై సోనూసూద్ కీలక సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్లైదుబాయ్ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై నటుడు సోనూ సూద్ స్పందించారు. అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్ తలుపు తెరవాల్సిన సందర్భాల్లో ఉపయోగపడేలా అదనపు భద్రతా వ్యవస్థను తీసుకురావడంపై విమానయాన సంస్థలు ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సోనూసూద్ ఓ పోస్టు చేశారు. 'ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు విమానయాన భద్రత అనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాల్సిన అంశమని గుర్తు చేస్తున్నాయి. కాక్‌పిట్ ప్రవేశానికి సంబంధించి విమానయాన సంస్థలు అదనపు అత్యవసర భద్రతా చర్యలను పరిశీలించాలని కోరుతున్నా.
వివరాలు
అత్యవసర కోడ్ ను ఉంచాలి
అత్యవసర పరిస్థితిలో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌లు తలుపు తెరవలేని పరిస్థితి ఏర్పడితే.. బయట ఉన్న సిబ్బంది సహాయం చేయడానికి వీలుగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చేమో ఆలోచించాలి.
కాక్‌పిట్ డోర్ తీయడానికి భద్రంగా సీల్ చేసిన అత్యవసర కోడ్‌ను బయట ఉండే ఒక సిబ్బంది వద్ద ఉంచే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చేమో. అయితే, దాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించేలా చూడాలని సోనూసూద్ సూచించారు.
వివరాలు
అసలేం జరిగింది?
ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయల్దేరిన ఓ విమానం కాక్‌పిట్‌లో ఘర్షణ చోటుచేసుకోవడంతో సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కోపైలట్ ప్రయత్నించడం, ఈ క్రమంలో కెప్టెన్‌ను గాయపర్చడం అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటన నేపథ్యంలోనే కాక్‌పిట్ భద్రత, అత్యవసర పరిస్థితుల్లో బయట ఉన్న సిబ్బంది జోక్యం చేసుకునే అవకాశం వంటి అంశాలపై సోనూసూద్ తన సూచనలను వెల్లడించారు.