Balayya : ముంబయి డాన్‌గా బాలయ్య.. డిసెంబర్ సోలో రిలీజ్ టార్గెట్
ఈ వార్తాకథనం ఏంటి
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. గతంలో వీరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై నందమూరి అభిమానుల్లో భారీగా అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించిన కథ విషయానికొస్తే.. దర్శకుడు గోపీచంద్ మలినేని తొలుత ఒక భారీ స్థాయి చారిత్రక కథను సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ కథకు అవసరమయ్యే భారీ బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దాని స్థానంలో ఇప్పుడు ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను లాక్ చేసినట్టు సమాచారం.
Details
ముంబయి నేపథ్యంతో మూవీ
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ముంబయి నేపథ్యంతో రూపొందనుంది. ఇందులో బాలకృష్ణను గోపీచంద్ మలినేని అత్యంత స్టైలిష్‌గా, ఇప్పటివరకు చూడని కొత్త మాస్ యాక్షన్ అవతార్‌లో చూపించబోతున్నారట. అయితే ఈ చిత్రంలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, మార్చి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించి, త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అలా జరిగితే సినిమాకు సోలో రిలీజ్ దక్కే అవకాశమూ ఉంటుంది.