Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టులో న్యాయం కోరుతా: బండ్ల గణేష్
ఈ వార్తాకథనం ఏంటి
తన ఆస్తి వేలం వ్యవహారంపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. బ్యాంకు అధికారులు తన ఆస్తిని అన్యాయంగా, మార్కెట్ విలువకు చాలా తక్కువ ధరకు విక్రయించారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. "లోపాయికారీ ఒప్పందాల ద్వారా, మార్కెట్ ధర కంటే చాలా తక్కువ మొత్తానికి బ్యాంకు అధికారులు నా ఆస్తిని విక్రయించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను 2022లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. ఈ కేసులో రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీలో) నాకు అనుకూలంగా తీర్పు వెలువడింది. అయితే, ఇటీవల హైకోర్టు నా వాదనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం పొందుతాననే దృఢమైన నమ్మకం నాకు ఉంది" అని పేర్కొన్నారు.
వివరాలు
బ్యాంకు చర్యలను సమర్థిస్తూ తీర్పు..
రుణ బకాయిల వసూళ్ల ప్రక్రియలో భాగంగా, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేసి విక్రయించింది. అయితే, ఆ వేలం ప్రక్రియను రద్దు చేసి, విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆస్తి యజమానులకు చెల్లించాలని గతంలో రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) ఆదేశాలు జారీ చేసింది. డీఆర్‌టీ ఇచ్చిన ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ యూనియన్ బ్యాంకు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఆస్తి వేలం చట్టబద్ధంగానే జరిగిందని నిర్ధారిస్తూ బ్యాంకు చర్యలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.