Vicky Kaushal - Aditya Dhar : భారీ బడ్జెట్ మూవీకి బ్రేక్.. విక్కీ కౌశల్-ఆదిత్య ధర్ సినిమా అటకెక్కినట్లేనా?
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ విజయయాత్ర కొనసాగుతోంది. 'యూరి' సినిమాతో మొదలైన ఆయన సక్సెస్ ప్రయాణం ఇటీవల విడుదలైన 'ఛావా' వరకు నిరాటంకంగా సాగింది. ప్రతి సినిమాకూ విభిన్నమైన జానర్‌ను ఎంచుకుంటూ, మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు పౌరాణిక కథలపై దృష్టి సారిస్తున్నారు. అయితే, ఆయన చేయాల్సిన ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పక్కకు వెళ్లడం, మరో భారీ మైథాలజీ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధం కావడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ'కు బ్రేక్!
విక్కీ కౌశల్ కెరీర్‌లోనే అత్యుత్తమ విజయాన్ని అందించిన దర్శకుడు ఆదిత్య ధర్‌తో కలిసి ఆయన చేయాల్సిన ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ'.
భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ కథ పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల వద్దకు వెళ్లి, చివరకు మళ్లీ విక్కీ కౌశల్ దగ్గరికే వచ్చిందనే ప్రచారం కూడా సాగింది.
అయితే ప్రస్తుతం విక్కీ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపుగా పక్కకు వెళ్లినట్లు కనిపిస్తోంది.
మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్ కూడా రణ్‌వీర్ సింగ్‌తో మరో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
'మహావతార్'తో పరశురాముడిగా విక్కీ కౌశల్!
దీంతో విక్కీ కౌశల్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' తెరకెక్కే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు.
'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' ప్రాజెక్ట్ పక్కకు వెళ్లినప్పటికీ, విక్కీ కౌశల్ మాత్రం మైథాలజీ జానర్‌ను వదులుకోవడం లేదు.
'స్త్రీ 2' ఫేమ్ దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించనున్న భారీ చిత్రం 'మహావతార్'లో ఆయన నటించనున్నారు.
ఈ సినిమాను మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. చిరంజీవి పరశురాముడి జీవిత కథ ఆధారంగా ఈ పౌరాణిక చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఇప్పటికే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2027 జనవరి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ స్పష్టం చేశారు.
వివరాలు
'లవ్ అండ్ వార్' తర్వాతే కొత్త అవతారం!
ప్రస్తుతం విక్కీ కౌశల్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ రొమాంటిక్ వార్ డ్రామా షూటింగ్ పూర్తయిన తర్వాత విక్కీ 'మహావతార్' కోసం సిద్ధం కానున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ఆయన పరశురాముడి పాత్రలో గండ్రగొడ్డలి పట్టుకుని యుద్ధరంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.
ఒకవైపు 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' వంటి భారీ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొనగా, మరోవైపు 'మహావతార్' రూపంలో విక్కీ కౌశల్ మరో పౌరాణిక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.