bigg boss 10 telugu contestants: బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 షురూ.. హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది వీళ్లే!
ఈ వార్తాకథనం ఏంటి
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న పాపులర్ రియాల్టీ షో 'బిగ్‌బాస్' సరికొత్త సీజన్‌తో మరోసారి సందడి మొదలుపెట్టింది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. 'బిగ్‌బాస్ తెలుగు సీజన్-10' (Bigg Boss 10 Telugu)లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. అగ్ర కథానాయకుడు నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
వివరాలు
ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్లు ఎవరో చూద్దాం..
తొలి కంటెస్టెంట్‌గా దేబ్జానీ బెంగాలీ నటి దేబ్జానీ
బిగ్ బాస్ సీజన్-10లో తొలి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఫన్ లవింగ్, నిజాయతీ, డే డ్రీమర్ అని పేర్కొన్నారు.
తాను ఎక్కువగా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతానని, రోజంతా ఎక్కడ పని చేసినా రాత్రికి ఇంటికి రావాల్సిందేనని చెప్పారు.
హౌస్‌లోకి వచ్చే వారిని స్నేహితులుగా చేసుకుంటానని, ఒకవేళ ఎవరైనా తనను శత్రువుగా భావించినా.. ఆ తర్వాత తనను అర్థం చేసుకుంటారని అన్నారు.
ఈ సందర్భంగా నాగార్జున ఆమెకు ఓ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్ల ప్రవర్తనను బట్టి వారికి పేర్లు పెట్టాలని, అందుకు సంబంధించిన బ్యాడ్జ్‌లను దేబ్జానీకి అందించారు.
వివరాలు
రెండో కంటెస్టెంట్ త్రిగుణ్
'పీఎస్‌వీ గరుడ వేగ', 'డియర్ మేఘ'తో పాటు పలు హారర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు త్రిగుణ్ రెండో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు.
తాను అందరిలో ఒకడిలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు.
వచ్చే శనివారం తాను తిరిగి హౌస్‌కు వచ్చేలోపు ఇంట్లో దెయ్యం ఉందని కనీసం నలుగురినైనా భయపెట్టాలని త్రిగుణ్‌కు సూచించారు.
వివరాలు
గోల్డెన్ టికెట్‌తో ఝాన్సీ
సింగర్ ఝాన్సీ బిగ్‌బాస్ సీజన్-10లో మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. 'అగ్నిపరీక్ష సీజన్-2'లో ప్రేక్షకుల ఓట్లతో పాటు జ్యూరీ సభ్యుల నిర్ణయం ఆధారంగా కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది.
అయితే వీటన్నింటికీ అతీతంగా గోల్డెన్ టికెట్ సాధించిన ఝాన్సీ నేరుగా బిగ్‌బాస్-10లోకి ఎంట్రీ ఇచ్చారు. మూడో తరగతి నుంచే పాటలు పాడటం ప్రారంభించానని ఝాన్సీ చెప్పారు.
అయితే తనకు సరైన అవకాశాలు రాలేదని, అందరికీ తెలిసేలా తనను తాను నిరూపించుకునేందుకు బిగ్‌బాస్ సరైన వేదికగా భావించి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
అనుకోకుండా గోల్డెన్ టికెట్ దక్కిందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు.
హౌస్‌లో సెలబ్రిటీలు, సామాన్యులు ఎవరైనా సరే దీటుగా ఎదుర్కొంటానని ఝాన్సీ స్పష్టం చేశారు.
వివరాలు
నాలుగో కంటెస్టెంట్‌గా సుధీర్‌రెడ్డి
'సుధీర్ టాక్స్' ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన సుధీర్‌రెడ్డి నాలుగో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. యూట్యూబర్‌గా మారకముందు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పారు. తాను చేసే పనిని మాత్రమే నమ్ముకుని ముందుకు సాగానని, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని తెలిపారు. ఉద్యోగం కోసం సింగపూర్ వెళ్లిన సమయంలో ఓ స్నేహితుడు మోసం చేయడంతో తన చేతిలో కేవలం 100 డాలర్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. ఏం చేయాలో తెలియక హౌస్ కీపింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ జీవించానని తెలిపారు. డబ్బులు లేక గురుద్వారాకు వెళ్లి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
వివరాలు
ప్రేక్షకుల ఓట్లతో అమన్
బిగ్‌బాస్ నిర్వహించిన 'అగ్నిపరీక్ష'లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన అమన్ ఐదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు.
గేమ్‌లో తాను ఎంతో నిజాయతీగా ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జున అమన్‌కు రెండు టాస్కులు ఇచ్చారు.
చిల్లులు పడిన ఓ టీషర్ట్‌ను ఇచ్చి అందులో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో గుర్తించాలని చెప్పారు. అలాగే రెడ్ డాట్‌ను అందించి, తన తర్వాత హౌస్‌లోకి వచ్చే ముగ్గురు కంటెస్టెంట్లలో ఒకరికి దాన్ని అంటించాలని సూచించారు.
ఒకవేళ ఆ పని చేసింది అమనే అని వారు గుర్తిస్తే అతడికి దక్కబోయే ఓ అద్భుతమైన అవకాశం చేజారిపోతుందని, వారు గుర్తించలేకపోతే వారి అవకాశాల్లో ఒకటి పోతుందని నాగార్జున వివరించారు.
వివరాలు
చైత్ర రాయ్ సెకండ్ ఇన్నింగ్స్
సీరియల్ నటి చైత్ర రాయ్ కూడా బిగ్‌బాస్ సీజన్-10లోకి అడుగుపెట్టారు.
తన నటనా ప్రయాణం గురించి మాట్లాడుతూ.. బరువు విషయంలో ఒకరు చేసిన కామెంట్‌ను సీరియస్‌గా తీసుకుని కేవలం మూడు నెలల్లో 80 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గినట్లు వెల్లడించారు.
బిగ్‌బాస్ చాలా పెద్ద ఫ్లాట్‌ఫామ్ అని, తనకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని చెప్పారు. తాను అందరితో త్వరగా కనెక్ట్ అవుతానని చెప్పిన చైత్ర.. అదే తన బలహీనత కాదని స్పష్టం చేశారు.
వివరాలు
జబర్దస్త్ నుంచి రామ్‌ప్రసాద్
'జబర్దస్త్' ద్వారా బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీతో అలరించిన రామ్‌ప్రసాద్ బిగ్‌బాస్ సీజన్-10లోకి ఎంట్రీ ఇచ్చారు.
శ్రీను, సుధీర్‌లతో కలిసి ఆయన చేసిన స్కిట్లు, పంచ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోనూ తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
స్ట్రాటజీతో ఆడతానన్న షాలిని
'అగ్నిపరీక్ష'లో ఫైనల్‌కు చేరిన వారిలో షాలిని కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ గేమ్‌లో తాను స్ట్రాటజీతో ఆడతానని చెప్పారు.
తాను చాలా ఎక్కువగా మాట్లాడతానని, హౌస్‌లో ఆ విషయం ప్రేక్షకులకు స్పష్టంగా తెలుస్తుందని షాలిని తెలిపారు.
వివరాలు
'టెంపర్' వంశీ ఎంట్రీ
సినిమాల్లో విలన్‌గా, నెగెటివ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'టెంపర్' వంశీ బిగ్‌బాస్ సీజన్-10లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు.
మైత్రీవనంలో కోర్సు చేస్తానని చెప్పి నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తనకు తొలి అవకాశం ఇచ్చారని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఎక్కువగా నెగెటివ్ రోల్స్ చేశానని చెప్పారు.
'టెంపర్' సినిమాలో తాను చేసిన పాత్ర ఎక్కువ మందికి చేరువ కావడంతో అప్పటి నుంచి ఇండస్ట్రీలో తనను 'టెంపర్' వంశీ అని పిలవడం ప్రారంభించారని వివరించారు.
ఇప్పటివరకు ప్రేక్షకులు తనను విలన్‌గా, సీరియస్ పాత్రల్లో చూశారని.. తనకు కూడా ఓ కుటుంబం, ప్రతి ఇంటికి చేరువ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
వివరాలు
సృష్టి కూడా హౌస్‌లోకి
'అగ్నిపరీక్ష' నుంచి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన మరో కంటెస్టెంట్ సృష్టి. తనకు మనోబలం ఎక్కువని, ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతానని ఆమె చెప్పారు.
'బిగ్‌బాస్-10 నరేశ్'గా గుర్తింపు రావాలి
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా తనదైన వినోదాన్ని పంచిన నరేశ్ బిగ్‌బాస్ సీజన్-10లోకి అడుగుపెట్టారు. తాను కమెడియన్‌గా అందరికీ తెలుసని, కానీ గూగుల్‌లో తన పేరు కొడితే 'బిగ్‌బాస్ సీజన్-10 నరేశ్' అని రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తన శక్తి మేరకు కచ్చితంగా గేమ్ ఆడతానని, 'అబ్బా.. గెలిచినంత పనిచేశాడు' అనిపించుకోవాలని ఉందన్నారు.
గత సీజన్లలోనూ ఎంతోమంది కమెడియన్లు వచ్చారని, వారందరినీ మిక్సీలో వేస్తే బయటకు వచ్చేది తానే నరేశ్ అంటూ తనదైన శైలిలో నవ్వించారు.
వివరాలు
చరణ్.. పర్సనాలిటీనే బలం
'అగ్నిపరీక్ష' ద్వారా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన మరో కంటెస్టెంట్ చరణ్. తన పర్సనాలిటీనే తన బలమని చెప్పారు. తన చుట్టూ ఎవరున్నా వారిని నవ్విస్తూ ఉంటానని చరణ్ తెలిపారు.
కృష్ణుడి మరో కోణం
నటుడు కృష్ణుడు కూడా బిగ్‌బాస్ సీజన్-10లోకి అడుగుపెట్టారు. సినిమాలే ప్రపంచంగా సాగుతున్న సమయంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా తాను లావుగా మారిపోయినట్లు చెప్పారు.
ఆ తర్వాత 'వినాయకుడు' సినిమాతో తనకు మంచి విజయం వచ్చిందని తెలిపారు.
ఇప్పటివరకు ప్రేక్షకులు తనను 'వినాయకుడు', అమాయకుడు వంటి పాత్రల్లో చూశారని.. అయితే బిగ్‌బాస్‌లో కృష్ణుడిలోని మరో కోణాన్ని చూస్తారని చెప్పారు.
ఫన్‌తో పాటు ఇతర ఎమోషన్స్‌ను కూడా ప్రేక్షకులకు చూపిస్తానని అన్నారు.
వివరాలు
వర్షిణి ఎంట్రీ
నటి, యాంకర్ వర్షిణి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇది చాలా పెద్ద ఫ్లాట్‌ఫామ్ అని, తాను ఇందులో ఫిట్ అవుతానని మొదట అనుకోలేదని చెప్పారు.
అయితే ఈ షోకు వెళ్లాలా వద్దా అనే విషయంపై ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు తనను తాను ప్రశ్నించుకున్నానని, చివరకు కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వర్షిణి తెలిపారు.
అగ్నిపరీక్ష నుంచి రోహిత్
బిగ్‌బాస్ 'అగ్నిపరీక్ష' నుంచి హౌస్‌లోకి అడుగుపెట్టిన మరో కంటెస్టెంట్ రోహిత్. తన జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన చిత్రం 'అన్నమయ్య' అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
హౌస్‌లోనూ తనదైన శైలిలో గేమ్ ఆడతానని రోహిత్ తెలిపారు.
వివరాలు
చివరి కంటెస్టెంట్‌గా ముకేశ్
బిగ్‌బాస్ సీజన్-10లో చివరి కంటెస్టెంట్‌గా నటుడు ముకేశ్ హౌస్‌లోకి వెళ్లారు. అంతకుముందు వేదికపై తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు.
పదేళ్ల క్రితం జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా నటుడు కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా కూడా నటించానని తెలిపారు.
తన ప్రతిభను నిరూపించుకుని ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని ఉందని, బిగ్‌బాస్ టాస్కుల్లో 100 శాతం శక్తితో పోరాడతానని చెప్పారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకు అన్నం పెట్టిందని పేర్కొన్న ముకేశ్.. తాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని ప్రేక్షకులను కోరారు.
ఇలా విభిన్న రంగాలకు చెందిన 16 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 ప్రారంభమైంది.