Loading...
Akkineni Nagarjuna: వెండితెర సోగ్గాడు ఆయనే.. వంద చిత్రాల గ్రీకువీరుడు.. నాగార్జున బర్త్‌డే నేడు..
వెండితెర సోగ్గాడు ఆయనే.. వంద చిత్రాల గ్రీకువీరుడు.. నాగార్జున బర్త్‌డే నేడు..

Akkineni Nagarjuna: వెండితెర సోగ్గాడు ఆయనే.. వంద చిత్రాల గ్రీకువీరుడు.. నాగార్జున బర్త్‌డే నేడు..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

'గ్రీకువీరుడు.. నా రాకుమారుడు.. కలల్లోనే ఇంకా ఉన్నాడు.. ఫిలిం స్టార్‌లు.. క్రికెట్ వీరులు.. కళ్లుకుట్టి చూసే కుర్రాడు.. డ్రీమ్‌బాయ్‌..' అంటూ మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాలో ఓ పాట నాగార్జున అందాన్ని, స్టైల్‌ను వర్ణించింది. వంద సినిమాల మైలురాయికి చేరువవుతున్నా.. ఇప్పటికీ అదే హ్యాండ్సమ్ లుక్స్‌, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అక్కినేని నాగార్జున. ఏడు పదులకు చేరువవుతున్నా.. 'మన్మథుడు' అనే పదానికి నిలువెత్తు రూపంలా కనిపిస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. నేడు ఈ వెండితెర సోగ్గాడి 67వ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'కింగ్‌' నాగార్జున సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

వివరాలు

విక్రమ్ మూవీతో ఎంట్రీ..

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా 1986లో 'విక్రమ్‌' సినిమాతో నాగార్జున వెండితెరకు పరిచయమయ్యారు.

అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' (1989) సినిమాతోనే ఆయనకు తొలి భారీ విజయం దక్కింది.

అప్పటివరకు సినిమాల ఎంపికలో తన నిర్ణయం పెద్దగా ఉండేది కాదని నాగార్జున ఓ సందర్భంలో చెప్పారు.

తెలుగు సినిమా హీరో అంటే ఇలాంటి మేకప్ ఉండాలి, డైలాగులు ఇలా చెప్పాలి అంటూ ఇతరులు చెప్పిన విధంగానే తాను ఫాలో అయ్యేవాడినని తెలిపారు.

అయితే మణిరత్నం చెప్పిన 'గీతాంజలి' కథ తనకు కొత్తగా అనిపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. అదే తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందని నాగార్జున వెల్లడించారు.

అదే ఏడాది రామ్‌గోపాల్‌ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున నటించిన 'శివ' విడుదలైంది.

వివరాలు

శివ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు..

శివ సినిమా నాగార్జున కెరీర్‌లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

అప్పటివరకు ఉన్న హీరోయిజాన్ని కొత్త కోణంలో చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా నాగార్జున సైకిల్ చైన్ తెంపే సన్నివేశం ఇప్పటికీ సినీ అభిమానులకు గుర్తుండిపోయింది.

తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు 'శివ'కు ముందు.. 'శివ' తర్వాత అని చెప్పుకునేంతగా ఈ సినిమా ప్రభావం చూపించింది.

అంతటి సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్‌ వర్మ నాగార్జునతోనే హిందీలోనూ రీమేక్‌ చేశారు.

1994లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్‌' నాగార్జున కెరీర్‌లో మరో ఘన విజయంగా నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు

తెలుగు సినీ చరిత్రలో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం..

1996లో నాగార్జున కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మించిన 'నిన్నే పెళ్లాడతా'కు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అప్పట్లో ఓ ట్రెండ్‌ను సెట్ చేసింది.

సినిమాలోని పాటలు, నాగార్జున-టబు కెమిస్ట్రీ, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అంతేకాదు.. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకోవడం విశేషం.

రొమాంటిక్ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన నాగార్జున.. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అన్నమయ్య' చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

శ్రీవేంకటేశ్వరుడి పరమభక్తుడు, వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల పాత్రలో నాగార్జున జీవించి నటించారు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎదిగారు.

ADVERTISEMENT

వివరాలు

విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు..

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఆయన నటనకు స్పెషల్ మెన్షన్ గుర్తింపు దక్కింది.

ఆ తర్వాత 'శ్రీరామదాసు', 'శిర్డీసాయి', 'ఓం నమో వెంకటేశాయ' వంటి మరికొన్ని ఆధ్యాత్మిక చిత్రాల్లోనూ నాగార్జున తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

'నువ్వు వస్తావని', 'సంతోషం', 'మన్మథుడు', 'మాస్‌', 'కింగ్‌', 'సోగ్గాడే చిన్నినాయన', 'బంగార్రాజు' వంటి సినిమాలతో నాగార్జున యువతను అలరిస్తూనే.. కుటుంబ ప్రేక్షకులనూ మెప్పించారు.

విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

వివరాలు

ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా 'మనం'

ఇక అక్కినేని కుటుంబానికి, వారి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా 'మనం'.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది.

అక్కినేని కుటుంబం తప్ప మరే కుటుంబానికీ ఈ కథ ఇంతగా సరిపోదంటే అతిశయోక్తి కాదు.

మూడు తరాల అక్కినేని నటులను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు కల్పించిన ఈ సినిమా.. వారి సినీ ప్రస్థానంలో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోయింది.

హ్యాపీ బర్త్ డే నాగ్..

ADVERTISEMENT