Disha Salian's Death Case : సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ కేసు..
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పదమృతి కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించింది. దర్యాప్తులో ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించవద్దని కోర్టు స్పష్టం చేసింది. దిశా సాలియాన్ కుటుంబ సభ్యులు ఆమెది హత్యేనని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ప్రమాదవశాత్తు మృతి (ADR)గా ఎందుకు పరిగణించారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. పోస్టుమార్టం నివేదికను కుటుంబ సభ్యులకు అందజేయకపోవడంపై కూడా కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీఎన్‌ఎస్ (BNS) కింద కేసు నమోదు చేయాలని కూడా బాంబే హైకోర్టు ఆదేశించింది.
వివరాలు
ఆ పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు..
దిశా తండ్రి సతీష్ సాలియాన్ దాఖలు చేసిన పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు.
తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్భంగా పోలీసుల తీరుపైనా ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది.
రాజకీయ నాయకులపై వచ్చిన ఫిర్యాదులు, రాజకీయ ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది.
నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ తండ్రి మనోభావాలను, న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారంపై చట్టబద్ధమైన, పారదర్శకమైన దర్యాప్తు జరిపి తగిన ముగింపునకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
వివరాలు
బాంబే హైకోర్టు ఆదేశాలు..
మాల్వాణి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.
తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని, ఆధారాలు లభించిన వ్యక్తులపైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఒకవేళ దర్యాప్తు అనంతరం సీబీఐ నెగెటివ్ రిపోర్ట్ సమర్పిస్తే.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ప్రొటెస్ట్ పిటిషన్' దాఖలు చేసే హక్కు పిటిషనర్‌కు ఉంటుందని కోర్టు తెలిపింది.
కాగా.. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వద్ద మేనేజర్‌గా పనిచేసిన సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియాన్ 2020 జూన్ 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
వివరాలు
రెండు ఘటనలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం..
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కిందపడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
దిశా మరణించిన ఆరు రోజులకే, 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఈ రెండు ఘటనలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి.
దిశా సాలియాన్ మృతి వ్యవహారం 2022లో మహారాష్ట్ర శాసనసభలోనూ చర్చకు వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి నితేష్ రాణే, ఆదిత్య థాకరేకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయం కూడా అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
షిండే వర్గం నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపించింది.