వాల్తేరు వీరయ్య థియేటర్లలో ఉండగానే సెట్స్ పైకి వెళ్తున్న చిరంజీవి చిత్రం
మెగాస్టార్ చిరంజీవి నుండి సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రేక్షకుల పాజిటివ్ స్పందనతో దూసుకుపోతుంది. మొదటిరోజు వచ్చిన మిశ్రమ స్పందన, ఆ తర్వాత రోజుల్లో వచ్చిన పాజిటివ్ టాక్ లో కొట్టుకుపోయింది. బాక్సాఫీసు వద్ద వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది వాల్తేరు వీరయ్య. చిరంజీవి ఒరిజినల్ సినిమాలు తీస్తే ఇలా ఉంటుందని, రీమేక్ సినిమాల చేయాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య విజయంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. అదలా ఉంటే తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి నెక్స్ట్ చిత్రం భోళాశంకర్ షూటింగ్ మొదలైందని సమాచారం. ఒక పక్క వాల్తేరు వీరయ్య థియేటర్లలో దుమ్ము దులుపుతుంటే మరో పక్క చిరంజీవి మరో సినిమా రెడీ అవుతోంది.
భోళాశంకర్ షూటింగ్ కోసం కోల్ కతా సెట్
మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భోళాశంకర్ పేరుతో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఈరోజు కొత్త షెడ్యూల్ మొదలైందని భోళాశంకర్ టీమ్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ కోసం కోల్ కతా నగరానికి సంబంధించిన ప్రదేశాలను సెట్ వేసారట. ఈ షూటింగ్ లో చిరంజీవి ఈరోజే జాయిన్ అవుతారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. భోళాశంకర్ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్.. మహిళా ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.