Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. వైరల్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారనే వార్తలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చిరంజీవి బృందం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున చిరంజీవికి బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించేందుకు ప్రతిపాదన వెళ్లిందనే కథనాలు వినిపించాయి. రాష్ట్రానికి పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసం చిరంజీవి ప్రజాదరణను వినియోగించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని ఆ వార్తల్లో పేర్కొన్నారు.
వివరాలు
ప్రచారం పూర్తిగా అసత్యం..
అయితే ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని చిరంజీవి టీమ్ వెల్లడించింది.
ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకుండా వస్తున్న వార్తలను నమ్మకూడదని, నిరాధార సమాచారాన్ని మరింతగా వ్యాప్తి చేయవద్దని కోరింది.
ఈ విషయాన్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా అధికారిక ప్రకటన రూపంలో వెల్లడించడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తెరపడింది.
ఇదిలా ఉంటే, సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.
యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఒకటి తర్వాత మరో సినిమాను ప్రకటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
ప్రస్తుతం దర్శకుడు బాబీ రూపొందిస్తున్న 'మెగా 158' చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.
వివరాలు
ఆగస్టు 22న టైటిల్ రివీల్..
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.
మరోవైపు దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'ను దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనంతరం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనుండగా, ఆ చిత్రాన్ని హీరో నాని నిర్మించనున్నట్లు సమాచారం.