ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఓనర్ల తీరుపై హరీష్ శంకర్ ఘాటు వ్యాఖ్యలు
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏ విషయం మీదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హెడ్స్ మీద ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న "ఏటీఎమ్" అనే వెబ్ సిరీస్ ప్రీ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, ఓటీటీ హెడ్స్ తీరుతెన్నుల గురించి వివరించాడు. ఇక్కడ ఓటీటీ హెడ్స్, తమ స్థానాన్ని ఎంజాయ్ చేస్తారని, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా వాళ్ళ దగ్గరికే రావాలని అనుకుంటారని, వాళ్ళకు కంటెంట్ కన్నా తమ సీటే ముఖ్యమని, అందుకే ఎక్కువ మంది డైరెక్టర్లు ఓటీటీ వైపు రాలేకపోతున్నారని అన్నాడు.
సినిమాతో పోలిస్తే ఓటీటీలో వచ్చే డబ్బులు చాలా తక్కవ
ఓటీటీలో సిరీస్ చేస్తే చాలా తక్కువ డబ్బులు వస్తాయని, ఇక్కడ పెట్టే కష్టం సినిమాలో పెడితే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయని, అయినా కూడా ఇక్కడ సిరీస్ లు చేయడానికి ఒక కారణం ఉందని, సినిమాకు లిమిట్ ఉంటుందని అన్నాడు. అన్ని కథలను సినిమాలో చెప్పలేమని, ఓటీటీలో అయితే అలా ఉండదని, క్రియేటర్ ఏది చెప్పాలనుకుంటే అది చెప్పే వీలుంటుందన్న ఆశతో, ప్యాషన్ తో ఇక్కడ సిరీస్ లు చేయాలనుకుంటారని అన్నాడు. ప్రస్తుతం జీ5 ఇచ్చిన సపోర్ట్ లాగానే మిగతా ఫ్లాట్ ఫామ్స్ కూడా ఇస్తే చాలామంది డైరెక్టర్లు ఓటీటీ వైపు చూస్తారని, ఈ విషయంలో తన మీద చాలామంది ట్రోల్ చేస్తారనీ, వాటి గురించి భయపడితే ఇక్కడిదాకా వచ్చేవాడినే కాదని చెప్పుకొచ్చాడు.