Mukul Roy: డిమెన్షియాతో పోరాడుతూ రాజకీయ 'చాణక్యుడు' ముకుల్ రాయ్ కన్నుమూత!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) ఇకలేరు. కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. తీవ్ర గుండెపోటే మరణానికి కారణమని ఆయన కుమారుడు శుభ్రాంషు రాయ్ వెల్లడించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండేళ్లుగా ముకుల్ రాయ్ డిమెన్షియా వ్యాధితో బాధపడుతూ వచ్చారు. అనారోగ్యం ప్రభావంతో జ్ఞాపకశక్తి పూర్తిగా దెబ్బతిని, చివరి దశలో తన కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇటీవల కొద్దిరోజులుగా కోమాలో ఉన్న ఆయనకు ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తూ వైద్యులు చికిత్స కొనసాగించారు.
వివరాలు
2021లో తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ముకుల్ రాయ్
1998లో మమతా బెనర్జీతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్థాపనలో భాగస్వామ్యమైన ముకుల్ రాయ్,ఆ పార్టీలో కీలక స్థానాన్ని సంపాదించి రెండో శ్రేణి నాయకుడిగా ఎదిగారు. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించడంలో ఆయన పాత్ర ప్రధానంగా నిలిచింది. అయితే 2017లో బీజేపీలో చేరి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకోవడంలో ఆయన వ్యూహాలు కీలకంగా ఉన్నాయని విశ్లేషకులు భావించారు. తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ టీఎంసీలోకి తిరిగి చేరారు.
వివరాలు
ముకుల్ మృతికి మమతా బెనర్జీ సంతాపం
అయితే ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనలేకపోయారు. ముకుల్ రాయ్ మరణంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, పార్టీ ఒక మేధావి నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత సంవత్సరం ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కలకత్తా హైకోర్టు ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించిన విషయం ప్రస్తావనీయమే.