
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉండడంతో కొంతకాలంగా సినిమా షూటింగ్స్‌కి విరామం ఇచ్చారు. అయితే ఇటీవల రాజకీయాల నుంచి కొంత సమయం దొరకడంతో మళ్లీ సినిమాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్స్‌ను వేగవంతం చేస్తూ ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్ రావు నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Details
జూన్ 12న మూవీ రిలీజ్
బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, అనసూయ, పూజా పొన్నాడ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇక విడుదలకు ముందే అంచనాలను పెంచేలా మేకర్స్ వరుసగా అప్డేట్లు విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్రబృందం ట్విటర్ వేదికగా ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. మే 21న ఉదయం 11గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ జరగనున్నట్లు వెల్లడిస్తూ, ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఈ ఈవెంట్‌లో పవన్ ఏమి మాట్లాడతారోనని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. ఇక పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలన్నింటిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.