అన్ స్టాపబుల్: ఢిల్లీ హై కోర్టులో ఆహా పిటీషన్.. అవి తొలగించాలని నిర్ణయం
అన్ స్టాపబుల్: ఏ ముహూర్తంలో ఈ షోకి ఆ పేరు పెట్టారో గానీ నిజంగా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. వ్యాఖ్యాతగా బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తున్నారు. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో, మొదటి సీజన్ ని పూర్తి చేసుకుని రెండవ సీజన్ లో అడుగుపెట్టింది. ఈ సీజన్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లు ఈ షోకి అతిధులుగా వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ లు ఇంటర్నెట్ లో రచ్చ లేపుతున్నాయి. ప్రస్తుతం ఆహా ఫ్లాట్ ఫామ్ ని నిర్వహించే అర్హ మీడియా బ్రాడ్ క్యాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. తమ కంటెంట్ ని పైరసీ చేసారని పేర్కొంది.
ఇంటర్నెట్ లోంచి తొలగించాలి
ఆహాలో వచ్చే కంటెంట్ అనధికారికంగా ఇతర ఫ్లాట్ ఫామ్ లలో కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆహాకు చెందిన వీడియోలు, ప్రోమోలు అనధికారికంగా ఎక్కడైతే విడుదల అయ్యాయో వాటన్నింటినీ తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్ లో అనదికారికంగా ఉన్న అన్నింటినీ తొలగించాలని పేర్కొంది. బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, అన్ స్టాపబుల్ షోకి అతిధిగా వచ్చాడు. ఈ ఎపిసోడ్ మొదటిభాగం డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయ్యింది. రెండవ భాగం జనవరి 6వ తేదీన విడుదల అవనుంది. ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అన్ స్టాపబుల్ షోలోకి వచ్చారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి వార్తను ప్రకటించలేదు ఆహా.