Loading...
Dont Trouble The Trouble Movie Review: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌.. ఫహద్‌ ఫాజిల్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌.. ఫహద్‌ ఫాజిల్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?

Dont Trouble The Trouble Movie Review: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌.. ఫహద్‌ ఫాజిల్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా నటించిన తొలి తెలుగు సినిమా 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌'. అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు సహా పలువురు తారలు ముందుకొచ్చి సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించింది?

వివరాలు

కథేంటంటే..

'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌'లో సూరి (ఫహద్‌ ఫాజిల్‌) అనాథ. హైదరాబాద్‌లో అంబులెన్స్‌ నడుపుకుంటూ తన స్నేహితుడు (వెంకటేశ్‌ కాకుమాను)తో కలిసి జీవిస్తుంటాడు.

తనను తాను మెజీషియన్‌గా చెప్పుకొనే సూరికి ఎప్పుడూ డబ్బు సంపాదించాలనే ఆలోచనే ఉంటుంది.

ఓ పందెంలో మోసం చేయడంతో పాతబస్తీకి చెందిన అస్లాం భాయ్‌ (మహేశ్‌ మంజ్రేకర్‌) గ్యాంగ్‌తో చిక్కులు తెచ్చుకుంటాడు.

తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని ఆ గ్యాంగ్‌ డిమాండ్‌ చేస్తుంది.

దాంతో చేసేదేమీ లేక డబ్బు కోసం ఓ సంపన్న కుటుంబానికి చెందిన చిన్నారి దివ్య (సారా పాలేకర్‌)ను కిడ్నాప్‌ చేసి, ఆమెను విడిపించేందుకు రూ.కోటి డిమాండ్‌ చేయాలని సూరి నిర్ణయించుకుంటాడు.

వివరాలు

దివ్య కోరిక నెరవేరిందా..?

డబ్బు చేతికి వచ్చిన తర్వాత అందులో రూ.25 లక్షలను అస్లాం భాయ్‌ గ్యాంగ్‌కు ఇచ్చి, మిగిలిన మొత్తంతో దుబాయ్‌ వెళ్లిపోవాలనేది అతడి ప్లాన్‌.

ఇదే క్రమంలో తన తల్లిదండ్రులను తానే మాయం చేశానని, వాళ్ల దగ్గరకు తనను తీసుకెళ్లాలంటూ అమాయకంగా సూరి వద్దకు వచ్చిన దివ్యను, ఆమె పెంపుడు కుక్క స్నూపీని పథకం ప్రకారం తీసుకెళ్లి కిడ్నాప్‌ నాటకానికి తెరతీస్తాడు.

మరి సూరి వేసిన పథకం ఫలించిందా? ఇంతకీ చిన్నారి దివ్య ఎవరు? తన తల్లిదండ్రులను తానే మాయం చేశానని ఆమె ఎందుకు చెబుతోంది? అమ్మానాన్నలను కలుసుకోవాలన్న దివ్య కోరిక నెరవేరిందా? అన్నదే మిగతా కథ.

ADVERTISEMENT

వివరాలు

ఎలా ఉందంటే..

పెద్దలతో పాటు చిన్నారులను కూడా అలరించే వినోదంతో సినిమాలు రావడం చాలా అరుదు. ప్రస్తుత ట్రెండ్‌లో అలాంటి కథలను ఆశించడం కూడా కష్టంగానే మారింది.

అగ్ర హీరోలతో పాటు యువ కథానాయకులు కూడా ప్రత్యేక ప్రపంచం, పాత్ర ప్రాధాన్యతతో సాగే కథలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న కాలమిది.

అలాంటి ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా.. చాలా రోజుల తర్వాత మనలో ఒకడిగా కనిపించే ఓ హీరో, అతడితో పాటు ఓ చిన్నారి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది.

భావోద్వేగాలు, హాస్యాన్ని ప్రధానంగా చేసుకుని తెరకెక్కిన ఫాంటసీ కథ ఇది. సరికొత్త నేపథ్యాన్ని ఆవిష్కరించిన ఈ కథలోని ఫాంటసీ కోణం ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా చిన్నారులు ఈ సినిమాను మరింతగా ఆస్వాదించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

కాస్త సాగదీత

ఫహద్‌ ఫాజిల్‌ పోషించే పాత్రలు తరచూ తెరపై కనిపించే సగటు హీరోలకు భిన్నంగా ఉంటాయి.

మనలో ఉండే లోపాలు, స్వార్థం, బలహీనతలను ప్రతిబింబించే పాత్రల్లో ఆయన కనిపిస్తుంటారు.

ఇందులోనూ అలాంటి లక్షణాలకు సరిపోయే సూరి పాత్ర ఆయనకు దక్కింది. అయితే సూరి అతడి ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు.

దీంతో ప్రారంభ సన్నివేశాలన్నీ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. చిన్నారి దివ్య కథలోకి వచ్చిన తర్వాత కథ కొంత ముందుకు కదిలినట్లు అనిపిస్తుంది.

అయితే విరామానికి ముందు వచ్చే సన్నివేశాలతోనే అసలు 'ట్రబుల్‌' మూమెంట్‌ తెరపై కనిపిస్తుంది. అక్కడ హాస్యం కూడా బాగానే పండింది.

వివరాలు

అశించిన స్థాయిలో కామెడీ పండలేదు

దివ్య ఎవరో తెలిసిన తర్వాత హీరో ఏం చేయబోతున్నాడనే ఆసక్తిని రేకెత్తిస్తూ ద్వితీయార్ధం మొదలవుతుంది.

దివ్యను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించేందుకు హీరో చేసే ప్రయత్నాలతో డ్రామా రక్తికడుతుంది. ఆ తర్వాత సినిమాకు అత్యంత కీలకమైన భావోద్వేగాలపై కథ దృష్టి పెడుతుంది.

అయితే అవి ఆశించిన స్థాయిలో పండలేదు. రోడ్డు ప్రమాదం నేపథ్యంగా వచ్చే సన్నివేశాలు మాత్రం ఏమాత్రం తర్కానికి అందవు.

పరభాషా చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు పెద్దగా ఇబ్బందిగా అనిపించకపోవచ్చు కానీ, తెలుగు ప్రేక్షకులకు మాత్రం అవి మరీ నాటకీయంగా అనిపిస్తాయి.

వివరాలు

హత్తుకునే భావోద్వేగాలు

దివ్య, సూరి పాత్రలతో ముడిపడిన ముగింపు.. అక్కడ మనసులను హత్తుకునే మలుపుతో కూడిన సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

సరికొత్త నేపథ్యం, ఆసక్తికరమైన ప్రీ-ఇంటర్వెల్‌ సన్నివేశాలు, హత్తుకునే భావోద్వేగాలతో కూడిన ముగింపు సినిమాకు బలంగా నిలిచాయి.

అయితే మిగిలిన భాగాల రచనపై దర్శకుడు, రచనా బృందం మరింత దృష్టి పెట్టాల్సి ఉంది.

సూరి పాత్రలో ఫహద్‌ ఫాజిల్‌ పూర్తిగా ఒదిగిపోయారు. చెడు నుంచి మంచి దిశగా సాగే ఆ పాత్రపై నటుడిగా ఆయన బలమైన ప్రభావాన్ని చూపించారు.

ఫహద్‌ పాత్రలకు, ఆయన లుక్‌కు తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే అలవాటు పడిపోయారు. అయితే సంభాషణలు పలికే తీరు విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం కనిపిస్తుంది.

వివరాలు

ఎవరెలా చేశారంటే..

దివ్య పాత్రలో సారా పాలేకర్‌ మంచి నటనను ప్రదర్శించింది. వెంకటేశ్‌ కాకుమాను కథానాయకుడి స్నేహితుడు మల్లేశ్‌ పాత్రలో కనిపించాడు.

సౌరభ్‌ సచ్‌దేవ్‌, సుబ్బరాజు, మహేశ్‌ మంజ్రేకర్‌ కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కాలభైరవ సంగీతంతో పాటు బ్రాడ్‌ ఫ్రాన్సిస్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా బాగుంది.

శశాంక్‌ యేలేటి ఒక మంచి ఫాంటసీ కథను రాసుకున్నారు. అయితే మధ్యభాగాల రచనపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. పదునైన రచనకు, మనసులను కట్టిపడేసే భావోద్వేగాలకు పెట్టింది పేరైన రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పించారు.

అయితే ఆయన సమర్పించిన ఈ సినిమా రచనలో ఆ లోటు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.

ADVERTISEMENT