Loading...
Dorothy Movie Review: డోరతీ మూవీ రివ్యూ.. కీర్తి సురేశ్‌ సినిమా మెప్పించిందా?
డోరతీ మూవీ రివ్యూ.. కీర్తి సురేశ్‌ సినిమా మెప్పించిందా?

Dorothy Movie Review: డోరతీ మూవీ రివ్యూ.. కీర్తి సురేశ్‌ సినిమా మెప్పించిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల తమిళనాట విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం 'డోరతీ'. కీర్తి సురేశ్‌, సనంత్‌, రిషికాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. గత వారమే తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని తాజాగా కథానాయకుడు రానా దగ్గుబాటి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మరి ఈ సినిమా కథేంటి? తెలుగు సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించిందో మూవీ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

వివరాలు

కథేంటంటే..

తమిళనాడులోని ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సుబ్బు (సనంత్‌), కార్తి (రిషికాంత్‌) ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుంచే కొట్లాటలు, గొడవలకు అలవాటు పడిన వీరిద్దరూ పెద్దయ్యాక రౌడీల్లా జీవనం సాగిస్తుంటారు.

అయితే చిన్నతనంలో పౌరుషం, మగతనం అంటూ గొడవలకు దిగే సుబ్బు.. వయసు పెరిగేకొద్దీ మృదు స్వభావిగా మారతాడు.

తనలో స్త్రీ లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తిస్తాడు. అయితే పురుషాధిక్య సమాజం నుంచి ఎదురయ్యే అవమానాలను ఎదుర్కొనే ధైర్యం లేక.. బయటికి మాత్రం ఓ క్రూరమైన మగవాడిలానే జీవిస్తుంటాడు.

ఈ క్రమంలో డోరతీ (కీర్తి సురేశ్‌) అతడి వదినగా వారి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆమెతో సుబ్బుకు బలమైన అనుబంధం ఏర్పడుతుంది.

వివరాలు

కథలో చిన్న, చిన్న ట్విస్టులు

అయితే అనూహ్యంగా డోరతీ కన్నుమూయడంతో సుబ్బు జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అతడు ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు.

అసలు సుబ్బు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? దాని కారణంగా కార్తి, సుబ్బుల జీవితాల్లో ఎలాంటి అనూహ్య పరిణామాలు, సమస్యలు ఎదురయ్యాయి?

ఎంతో సన్నిహితంగా ఉన్న వీరిద్దరి స్నేహం చివరకు వైరంగా ఎందుకు మారింది? సుబ్బును చంపేయాలని కార్తిని అతడి కుటుంబ సభ్యులు ఎందుకు బలవంతం చేశారు? చివరికి సుబ్బు, కార్తిల స్నేహ ప్రయాణం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.

ADVERTISEMENT

వివరాలు

ఎలా సాగిందంటే..

సమాజంలోని అసమానతలను తన కథల ద్వారా ఎత్తిచూపడంలో దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు ముందుంటారు.

ముఖ్యంగా తాను ఎలాంటి కథను ఎంచుకున్నా.. అందులో అంతర్లీనంగా కుల, వర్ణ వివక్షతలను స్పృశించే ప్రయత్నం చేస్తుంటారు.

అయితే 'డోరతీ'తో మాత్రం సమాజంలో తరతరాలుగా పేరుకుపోయిన లింగ వివక్షతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఓవైపు కుల వివక్ష, పితృస్వామ్య సమాజంలోని విపరీత పోకడలను ప్రశ్నిస్తూనే.. మరోవైపు ట్రాన్స్‌జెండర్‌ సమాజం పట్ల ఉన్న చిన్నచూపు, వారు ఎదుర్కొంటున్న అవమానాలు, వారి అంతర్గత సంఘర్షణను మనసులకు హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశారు.

అయితే చర్చించాల్సిన అంశాన్ని ఎంచుకున్నప్పటికీ.. దాన్ని పూర్తి స్థాయిలో జనరంజకంగా తెరపై ఆవిష్కరించడంలో కార్తిక్‌ సుబ్బరాజు కొంత మేర విఫలమయ్యారు.

ADVERTISEMENT

వివరాలు

ఆసక్తికరంగా కథ

దర్శకుడు ఈ కథను నాన్‌-లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో నడిపించడం వల్ల కొన్ని చోట్ల కథనం గందరగోళంగా అనిపిస్తుంది.

సుబ్బు, కార్తి మధ్య ఉన్న స్నేహాన్ని, వారి చిన్నతనాన్ని పరిచయం చేస్తూ సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

ముఖ్యంగా చిన్నతనంలో సుబ్బు వ్యవహార శైలి, అతడి కుటుంబ నేపథ్యం, గ్రామంలోని కుల రాజకీయాలు, వివక్ష, హింస వంటి అంశాలతో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.

డోరతీ పాత్ర కథలోకి ప్రవేశించిన తర్వాత సినిమా ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.

డోరతీ, సుబ్బు పాత్రల చుట్టూ నడిపిన డ్రామా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఓ ఊహించని మలుపుతో ప్రథమార్ధానికి విరామం ఇవ్వడం థ్రిల్‌ను పంచుతుంది.

ద్వితీయార్ధం నుంచి సినిమా మొత్తం ఓ భావోద్వేగభరితమైన ప్రయాణంలా సాగుతుంది.

వివరాలు

బోల్డ్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు

అయితే ఈ దశలో కథన వేగం మందగిస్తుంది. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అవమానాలు, వారిపట్ల సమాజం చూపించే వివక్షను దర్శకుడు బోల్డ్‌గా చూపించే ప్రయత్నం చేశారు.

అయితే కొన్ని సన్నివేశాలు సహజమైన డ్రామాలా కాకుండా మరీ ఉపన్యాసాల్లా అనిపిస్తాయి.

అలాగే సినిమాలోని బోల్డ్‌ ఎమోషన్స్‌ను సాధారణ ప్రేక్షకులు పూర్తిగా జీర్ణించుకోవడం కష్టంగానే అనిపిస్తుంది. ప్రీక్లైమాక్స్‌ నుంచి కథ మరింత భావోద్వేగభరితంగా మారుతుంది.

సుబ్బును చంపేందుకు కార్తి ఎంచుకున్న ఎత్తుగడ ఆకట్టుకుంటుంది. పతాక ఘట్టాలు మనసులను హత్తుకునేలా, ఆలోచింపజేసేలా ఉంటాయి.

అయితే డోరతీ మరణానికి కారణమెవరు? ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చింది? అనే కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే సినిమాను ముగించడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది.

వివరాలు

ఎవరెలా చేశారంటే..

ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సుబ్బు పాత్రే. రెండు కోణాల్లో సాగే ఈ పాత్రలో సనంత్‌ సహజమైన నటనతో ఆద్యంతం ఆకట్టుకుంటారు.

ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్‌గా మారే క్రమంలో ఆయన పలికించిన హావభావాలు, కనబరిచిన నటన అద్భుతంగా ఉంటాయి.

అలాగే కార్తి పాత్రలో రిషికాంత్‌ అభినయం ఆకట్టుకుంటుంది. సుబ్బు, కార్తి మధ్య ఉన్న కెమిస్ట్రీ, వారిద్దరి మధ్య కనిపించే ఎమోషనల్‌ బాండింగ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

టైటిల్‌ పాత్రలో నటించిన కీర్తి సురేశ్‌ తెరపై కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ.. కథను కీలక మలుపు తిప్పడంలో ఆమె పాత్ర ముఖ్యంగా నిలుస్తుంది.

కుటుంబ గౌరవం కోసం కన్నకొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని తండ్రిగా విజిల్‌ వీరయ్య పాత్రలో ముత్తుకుమార్‌ నటన ఆకట్టుకుంటుంది.

వివరాలు

ఇళయరాజా సంగీతం అదనపు బలం

జీవా సుబ్రమణియన్‌, రామచంద్రన్‌ దురై రాజ్‌, సౌందరరాజ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

దర్శకుడు చెప్పాలనుకున్న విషయం చర్చించదగ్గదే అయినప్పటికీ.. దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా తెరపైకి తీసుకురాలేకపోయారు.

ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం, పతాక ఘట్టంలో వచ్చే పాట ప్రేక్షకులను హత్తుకునేలా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ వర్క్‌ కూడా ఆకట్టుకుంటాయి. ఈ రెండు విభాగాలు ప్రేక్షకులను 90ల కాలంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి.

ADVERTISEMENT