Page Loader
Ranbir Kapoor : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు.. ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం
ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం

Ranbir Kapoor : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు.. ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 04, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవలే మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు బహిర్గతమయ్యాయి. బెట్టింగ్‌ యాప్‌ మాటున ఈ భారీ కుంభకోణాన్ని ఇటీవలే ఈడీ రట్టుచేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ యూఏఈలోని దుబాయ్‌ కేంద్రంగా మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను చేపట్టారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ జరుగుతోందన్న ఈడీ, బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ అకౌంట్లకు తరలించేందుకు హావాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

details

మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను సీజ్‌ చేసిన ఈడీ

మరోవైపు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు బెట్టింగ్‌ యాప్‌ భారీగా ప్రకటనల కోసం ఖర్చు చేసినట్టు ఈడీ తెలిపింది. కోల్‌కతా, భోపాల్‌, ముంబై లాంటి నగరాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ, మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను సీజ్‌ చేసింది. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరైన సౌరభ్‌ చంద్రఖర్‌ వివాహం ఫిబ్రవరిలో యూఏఈలో నిర్వహించగా రూ.200 కోట్లు ఖర్చు చేశారు. వేడుకకు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ,నేహా కక్కర్‌, అతిఫ్‌ అస్లమ్‌,రహత్‌ ఫతేహ్‌ అలీఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే రణ్‌బీర్‌ కు సమన్లు జారీ అయ్యాయి. మరో 17 మంది సెలబ్రిటీలపై ఈడీ నిఘా ఉంచినట్లు సమాచారం. త్వరలోనే వీరికి సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నాయి.