Erracheera : రాజేంద్ర ప్రసాద్ వారసురాలిగా బేబీ సాయి తేజస్విని తెరంగేట్రం.. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు!
నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా, కమెడియన్‌గా, నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన ఓ పాత్ర చేస్తున్నాడంటే అందులో జీవిస్తాడు. ఆయన తర్వాతి తరంలో ఇప్పటివరకూ ఎవరూ సినిమాల్లోకి రాలేదు. తాజాగా ఇప్పుడు ఆయన మనుమరాలు తెరంగేట్రానికి సిద్ధమైంది. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఎర్రచీర' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ సినిమాకు సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
హార్రర్, యాక్షన్ అంశాలతో రూపొందితున్న 'ఎర్రచీర'
ఈ సినిమాలో 45 నిమిషాల కంటే ఎక్కువ సమయాన్ని కళ్లుచెదిరించే గ్రాఫిక్స్ తో రూపొందించామని ఇప్పటికే సుమన్ బాబు తెలిపారు. ఈ చిత్రాన్ని మథర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ అంశాలతో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. బేబీ సాయి తేజస్విని నటన కొత్తగా ఉంటుందని, క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్ అందరికీ కన్నీరు తెప్పిస్తుందని సుమన్ బాబు వెల్లడించారు. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల సంగీతాన్ని అందించారు. ఎర్రచీర చిత్రం డిసెంబర్ 20న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలకానున్నట్టు నిర్మాతలు విజయదశమి సందర్భంగా ప్రకటించారు.