Venky-Anil : అనిల్ రావిపూడి సినిమాలో ఫహద్ ఔట్… కార్తీ ఇన్? ఫిలింనగర్‌లో హాట్ చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి,వెంకటేష్ కలయికలో రూపొందనున్న తాజా చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ముఖ్యమైన 'బావమరిది' పాత్ర కోసం మొదట మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేయాలని చిత్ర బృందం భావించిన విషయం తెలిసిందే. కథ నచ్చిన ఫహద్ ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపినట్లు కూడా సమాచారం వెలువడింది. అయితే తాజా వార్తల ప్రకారం ఆయన ఈ చిత్రంలో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్,పుష్ప చిత్రం తర్వాత తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు ఆయన సుమారు రూ.10 కోట్ల పారితోషికం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
కార్తీ ఎంపిక దాదాపు ఖరారు
అయితే అంత పెద్ద మొత్తాన్ని చెల్లించడం బడ్జెట్ పరంగా భారమవుతుందని భావించిన నిర్మాతలు ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని సమాచారం. దీంతో ఫహద్ స్థానంలో ఇప్పుడు తమిళ నటుడు కార్తీ పేరు ముందుకు వచ్చింది. కార్తీకి తెలుగులో మంచి ఆదరణ ఉంది. గతంలో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వ్యాపార పరంగా కూడా కార్తీ ఈ ప్రాజెక్ట్‌కు మేలు చేస్తారని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరిగినట్లు వార్తలు రాగా, తాజా పరిణామాల నేపథ్యంలో కార్తీ ఎంపిక దాదాపు ఖరారైనట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
వివరాలు
థానాయికలుగా కీర్తి సురేష్ లేదా పూజా హెగ్డే
ఈ చిత్రంలో వెంకటేష్-కార్తీ మధ్య సాగే హాస్య సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం విశ్వసిస్తోంది. ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకుని చిత్రీకరణ ప్రారంభం కానుంది. కథానాయికలుగా కీర్తి సురేష్ లేదా పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.