
FATHERS DAY 2025: టాలీవుడ్ లో తండ్రి పాత్రలకు జీవం పోసిన నటులు వీరే..
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచానికి ఎందరో గొప్ప నటులను పరిచయం చేసింది.
కొన్ని పాత్రల పేర్లు వినగానే కొన్ని ముఖాలు మన మనసులో మెదులుతాయి.
ఉదాహరణకు గయ్యాలి అత్త పాత్రకు సూర్యకాంతం, తల్లి పాత్రకు నిర్మలమ్మ అనేవారు.
ఇదే విధంగా, తెరపై తండ్రి పాత్రల్లో జీవించిన ఎన్నో గొప్ప నటులున్నారు.
జూన్ 15న జరగనున్న 'ఫాదర్స్ డే'ను పురస్కరించుకుని, వెండితెరపై తండ్రులుగా గొప్పగా నటించిన వారిని గుర్తు చేసుకుందాం.
వివరాలు
గుమ్మడి వెంకటేశ్వరరావు
1950లలో హాస్యనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన గుమ్మడి, తరువాత విలన్ పాత్రలకూ, ఆపై హీరో లేదా పెద్దన్న పాత్రలకూ పరిచయమయ్యారు.
ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోల సరసన ప్రధాన పాత్రలు పోషించారు.
1970ల చివర నాటికి తండ్రి పాత్రల వైపు అడుగులు వేశారు. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి చిత్రాల్లో హీరోల తండ్రిగా, కొన్నిసార్లు విలన్ పాత్రలకు తండ్రిగా కూడా నటించారు.
ఆయన పాత్రలు 'భార్యభర్తలు', 'సంపూర్ణ రామాయణం', 'ఇద్దరు మిత్రులు', 'మరో మలుపు', 'పునర్జన్మ', 'అంతస్తులు', 'ఆస్తిపరులు', 'బృందావనం' వంటి సినిమాల్లో గుర్తుంచుకుంటారు.
వివరాలు
ఎస్.వి. రంగారావు
1950లలోనే ఏఎన్నార్, ఎన్టీఆర్ చిత్రాల్లో తండ్రి పాత్రలు పోషించారు.
'పెళ్లి చేసి చూడు'లో ఎన్టీఆర్ తండ్రిగా, ఇతర చిత్రాల్లో కథానాయిక తండ్రిగా కనిపించారు.
పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన రంగారావు, 'మిస్సమ్మ', 'అప్పు చేసి పప్పు కూడు', 'లక్ష్మీనివాసం', 'తాత-మనవడు', 'ఆత్మబంధువు', 'దసరాబుల్లోడు' వంటి చిత్రాల్లో తండ్రిగా ముద్రవేశారు.
చిత్తూరు వి.నాగయ్య
తెలుగు తొలి స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన నాగయ్య, ఆ కాలంలోనే లీడ్ రోల్‌కు లక్షకు పైగా పారితోషికం అందుకున్నారని చెబుతారు.
తరువాత తండ్రి పాత్రలవైపు వచ్చారు. ఆయన నటించిన 'పాండురంగ మహత్యం', 'శ్రీ సీతారామ కళ్యాణం', 'వాగ్దానం', 'మూగనోము' చిత్రాల్లో తండ్రిగా ప్రేక్షకులను మెప్పించారు.
వివరాలు
కైకాల సత్యనారాయణ
పలు చిత్రాల్లో విలన్‌గా పేరుగాంచిన కైకాల సత్యనారాయణ , తరువాత పాజిటివ్ క్యారెక్టర్‌ల వైపు వెళ్లారు.
'శ్రీ రంగ నీతులు', 'అమ్మ రాజీనామా', 'శుభలేఖ', 'మంత్రి గారి వియ్యంకుడు', 'మజ్ను', 'ఆఖరి పోరాటం', 'పెళ్లి సందడి' చిత్రాల్లో తండ్రిగా ఆకట్టుకున్నారు.
చంద్ర మోహన్
1990లలో హాస్య నటుడిగా పేరు పొందిన చంద్ర మోహన్, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తండ్రి పాత్రల్లో మెప్పించారు.
'ఆమె', 'ఒక్కడు', 'నువ్వే నువ్వే', 'ఢీ', 'మనసంతా నువ్వే', '7జీ బృందావన కాలనీ', 'గులాబీ' వంటి చిత్రాల్లో ఆయన తండ్రి పాత్రలు గుర్తుండిపోయేలా ఉన్నాయి.
వివరాలు
సుత్తి వీరభద్రరావు
హాస్యభరిత తండ్రి పాత్రల్లో తనదైన శైలి చూపించిన వీరభద్రరావు, ముఖ్యంగా జంధ్యాల చిత్రాల్లో కామెడీ హీరోల తండ్రిగా గుర్తింపు పొందారు.
'చూపులు కలసిన శుభవేళ', 'శ్రీవారికి ప్రేమలేఖ', 'నాలుగు స్తంభాల ఆట', 'మొగుడు పెళ్లాలు' చిత్రాల్లో హాస్యభరిత తండ్రి పాత్రలతో మెప్పించారు.
ప్రకాష్ రాజ్
విలన్, తండ్రి పాత్రల్లోనూ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్‌కి 'నువ్వే నువ్వే', 'అంతఃపురం', 'నువ్వు నాకు నచ్చావ్', 'దిల్', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'పరుగు', 'బొమ్మరిల్లు' వంటి చిత్రాల్లో తండ్రిగా చేసిన పాత్రలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
వివరాలు
మురళీ శర్మ
2010ల తర్వాత తండ్రి పాత్రలలో ప్రముఖ నటుడిగా ఎదిగిన మురళీ శర్మ, 'భలే భలే మొగాడివోయ్', 'అల వైకుంఠపురంలో', 'విజేత', 'పడి పడి లేచే మనసు' చిత్రాల్లో తండ్రిగా గుర్తింపు పొందారు.
రాజేంద్ర ప్రసాద్
కామెడీ హీరోగా సినీరంగంలోకి ప్రవేశించి తండ్రి పాత్రలవైపు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్, 'ఆ నలుగురు', 'మహానటి', 'కౌసల్య కృష్ణమూర్తి', 'సుప్రీమ్', 'ఈడో రకం ఆడో రకం', 'నాన్నకు ప్రేమతో' వంటి చిత్రాల్లో తండ్రిగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
నరేశ్
కామెడీ హీరోగా కెరీర్ మొదలుపెట్టి, తండ్రి పాత్రల్లో ప్రాధాన్యతను పొందారు. 'భలే భలే మొగాడివోయ్', 'దృశ్యం', 'సమ్మోహనం', 'అందరి బంధువయా' వంటి చిత్రాల్లో తండ్రిగా సజీవంగా కనిపించారు.
వివరాలు
రావు రమేశ్
తండ్రి రావు గోపాలరావు తరహాలోనే పాజిటివ్, నెగెటివ్ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన రావు రమేశ్, 'ఓ బేబీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'RX100', 'అ..ఆ', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాల్లో తండ్రిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు.
జగపతి బాబు
హీరోగా పేరొందిన జగపతి బాబు, తరువాత విలన్, తండ్రి పాత్రల్లోకి మారారు. 'శ్రీమంతుడు', 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి చిత్రాల్లో తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు.