శాకుంతలం ప్రమోషన్స్: మల్లికా మల్లికా పాటకు విశేష స్పందన
సమంత నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా నుండి మల్లికా మల్లికా అనే పేరుతో మొదటి పాట రిలీజ్ అయ్యింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. మల్లికా మల్లికా మాలతీ మాలికా, చూడవా చూడవా ఏడి నా ఏలికా అంటూ తన ప్రియుడు దుష్యంతుడు ఎక్కడ ఉన్నాడంటూ అడవిలోని పక్షుల్ని, చెట్లనీ శకుంతల అడుగుతున్నట్లుగా ఉంది ఈ పాట. ఒకరకంగా ఇది విరహగీతం అని చెప్పుకోవచ్చు. మణిశర్మ అందించిన సంగీతం శ్రావ్యంగా ఉంది. రమ్యబెహరా గొంతు, చైతన్య ప్రసాద్ లిరిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. లిరిక్ వీడియోలో కనిపించిన విజువల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో రిలీజ్ చేసారు.
వెండితెరపై కాళిదాసు రచించిన కావ్యం
ఇటీవల శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. నాలుగో శతాబ్ద కాలంలో జన్మించిన కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం లోని కథను తెరపైకి తీసుకొస్తున్నాడు గుణశేఖర్. దేవతా వేశ్యా మేనకకు జన్మించిన శకుంతల, మహారాజు దుష్యంతుడి ప్రేమలో ఎలా పడిందీ, ఆ తర్వాత జరిగే సంఘటనలు ఏమిటన్నదే కథ అని శాకుంతలం ట్రైలర్ చూస్తే అర్థమయ్యింది. దుష్యంతుడి పాత్రలో మళయాలం నటుడు దేవ్ మోహన్ కనిపిస్తున్నారు. మరికొన్ని కీలక పాత్రలో డాక్టర్ మోహన్ బాబు, గౌతమి, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగల్ల కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు.