LOADING...
#SankranthiSpecial: సంక్రాంతి వేళ ఫోక్ సాంగ్స్.. వినడానికి, చూడడానికి అదిరిపోయే సాంగ్స్ ఇవే! 

#SankranthiSpecial: సంక్రాంతి వేళ ఫోక్ సాంగ్స్.. వినడానికి, చూడడానికి అదిరిపోయే సాంగ్స్ ఇవే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ధన ధాన్యాలతో నిండిన ఇళ్లూ.. పిల్లల గలగలలతో మార్మోగుతున్న వాకిళ్లూ.. భోగి పళ్ల తలంబ్రాల స్నానాల సందడి.. రంగురంగుల రంగవల్లులు.. గొబ్బెమ్మల అలంకారాలు.. హరిదాసుల భజనలు.. డూడూ బసవన్నల కోలాహలం.. కొత్త అల్లుళ్లకు మర్యాదలు.. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు.. ఇలా ప్రకృతి ప్రసాదించే సంక్రాంతి శోభకు పొగమంచుతో స్వాగతం పలుకుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ప్రతి ఏటిలాగే ఈ ఏడాది కూడా పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చుతూ మంచి మంచి సంక్రాంతి ఫోక్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'నిగ నిగ' అంటూ సాగే పాటతో బుల్లితెర సావిత్రి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి సందడి చేస్తుండగా..'హేమంత మంచుల్లో సూర్యుడు' అంటూ మంగ్లీ పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Details

హేమంత మంచుల్ల సూరీడూ ఏడుగుర్రాలెక్కి వచ్చాడూ

వినేకొద్దీ వినాలనిపించేలా, చూసేకొద్దీ చూడాలనిపించేలా ఉన్న ఈ పాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌లో ఎక్కువగా ఆదరణ పొందుతున్న కొన్ని ఫోక్ సాంగ్స్‌పై ఓ చూపు వేస్తే.. ఊపు తెప్పించే లిరిక్స్‌, స్టెప్పులు వేయించే మ్యూజిక్‌తో మంగ్లీ పాడిన 'హేమంత మంచుల్ల సూరీడూ ఏడుగుర్రాలెక్కి వచ్చాడూ' పాట ఈ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు దాము రెడ్డి చిత్రీకరణ చేయగా, సమర్పణ కూడా మంగ్లీనే. కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉంది. కొత్త అల్లుళ్లు, రంగవల్లులు, గొబ్బెమ్మలు వంటి సంక్రాంతి సంప్రదాయాలను చక్కగా ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ పాట వినడానికి మాత్రమే కాదు, చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

Details

నిగ నిగ నిగ సంక్రాంతి

'నిగ నిగ నిగ సంక్రాంతి' అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మిట్టపల్లి సురేందర్ రచించిన ఈ పాటను అల ప్రొడక్షన్‌ సమర్పణలో సింగర్ సాహితీ చాగంటి ఆలపించారు. బుల్లితెర సావిత్రి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి ఇందులో నటించారు. మదీన్ ఎస్‌కే అందించిన సంగీతం పాటకు ప్రధాన బలం. 'నిగనిగనిగ నెగడు నుండి పుట్టిన కాంతి సంక్రాంతి.. ధగధగధగ మెడలో నగలను మించిన కాంతి సంక్రాంతి' అంటూ సాగే లిరిక్స్ ఈ పండగ ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నాయి.

Advertisement

Details

యేటి గట్టు పక్కన పచ్చని పైరు ఊగేనంట

'యేటి గట్టు పక్కన పచ్చని పైరు ఊగేనంట.. నీలి ఆకాశనా గాలి పాటాలా సందడులంటా.. నేల వాకిళ్లన్నీ రంగులు పొంగే సంక్రాంతి పండగ వచ్చే' అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం అందరి మనసులను దోచుకుంటోంది. శ్రావణ భార్గవి ఆలపించిన ఈ పాటకు సత్యసాగర్ సాహిత్యం అందించగా, సంగీతాన్ని సమకూర్చారు. భార్గవితో కలిసి సాయి చరణ్ కూడా ఈ పాటను ఎంతో మధురంగా పాడారు.

Advertisement

Details

రానే వచ్చింది హంగులతో

మ్యాంగో మ్యూజిక్ సమర్పణలో రూపొందిన 'రానే వచ్చింది సంక్రాంతి హంగులతో..' పాట పండగ వైభవాన్ని ఒక్క పాటలో చూపించేలా రూపొందింది. 'రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈ నాడే సంక్రాంతి' అంటూ సాగే ఈ పాటను సింగర్ మధుప్రియ ఆలపించారు. కమల్ హరిపురం దర్శకత్వం వహించగా, పుండరీక అందించిన సాహిత్యం పాటకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. బోలే శావలి అందించిన సంగీతం పాటకు మరింత అందాన్ని చేకూర్చింది.

Details

వసంతం వాకిట నిలిచి

జానపద గాయని తేలు విజయ పాడిన 'వసంతం వాకిట నిలిచి' పాట కూడా ఈ సంక్రాంతి సీజన్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎస్‌టీవీ ఆడియోస్ అండ్ వీడియోస్ సమర్పణలో రూపొందిన ఈ పాటకు తైదల అంజయ్య సాహిత్యం అందించగా, శ్రీకాంత్ సంగీతం సమకూర్చారు. ఇలా సంక్రాంతి పండగ శోభను, గ్రామీణ జీవన సౌందర్యాన్ని, సంప్రదాయాల పరిమళాన్ని ఫోక్ సాంగ్స్ రూపంలో మరింత రంగులద్దుతూ ఈ పాటలు పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

Advertisement