LOADING...
Dharmendra: నస్రాలీ గ్రామం నుంచి జాతీయ స్టార్‌డమ్‌ వరకు—ధర్మేంద్ర అద్భుత సినీ ప్రయాణమిదే!
నస్రాలీ గ్రామం నుంచి జాతీయ స్టార్‌డమ్‌ వరకు—ధర్మేంద్ర అద్భుత సినీ ప్రయాణమిదే!

Dharmendra: నస్రాలీ గ్రామం నుంచి జాతీయ స్టార్‌డమ్‌ వరకు—ధర్మేంద్ర అద్భుత సినీ ప్రయాణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినిమాకు అజరామరమైన నటుడిగా నిలిచిన ధర్మేంద్ర (Dharmendra) బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. రొమాంటిక్‌ హీరోగా, యాక్షన్‌ స్టార్‌గా, 'హీ మ్యాన్‌'గా... ప్రతి రూపం ఆయనకే ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆయన మృతితో భారతీయ చిత్ర పరిశ్రమ తీరని లోటును చవిచూసింది. ధర్మేంద్ర సినీ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

Details

గ్రామం నుంచి గ్లోబల్ స్టార్‌గా…

ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్‌ క్రిషన్‌ దేవోల్‌. పంజాబ్‌లో లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో 1935 డిసెంబర్‌ 8న జన్మించారు. 1952లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసిన ఆయన, 19 ఏళ్లకే 1954లో ప్రకాశ్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి సన్నీ దేవోల్‌, బాబీ దేవోల్‌ ఇద్దరు కుమారులు, విజేత, అజీత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనంతరం 1980లో హేమామాలినిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఈషా దేవోల్‌, అహానా దేవోల్‌ జన్మించారు. మొదటి వివాహానంతరం బాలీవుడ్‌ వైపు అడుగుపెట్టిన ధర్మేంద్ర మొదట చిన్న పాత్రల్లో కనిపించారు. హ్యాండ్‌సమ్‌ మ్యాన్‌గా ఫిల్మ్‌ఫేర్‌ కవర్‌పేజీలపై మెరిసి పలు అవార్డులు పొందారు.

Details

'హఖీఖత్‌' తో భారీ విజయం

1960లో విడుదలైన 'దిల్ భీ తేరా హమ్ భీ తేరే'తో ఆయన నట జీవితానికి శ్రీకారం చుట్టారు. 1961లో వచ్చిన 'షోలా ఔర్ షబ్నమ్‌' మంచి గుర్తింపు తెచ్చింది. 'అయే మిలాన్‌ కి బేలా'తో ప్రజాదరణ మరింత పెరిగింది. తొలిసారి లీడ్‌ రోల్‌ చేసిన 'హఖీఖత్‌' (1964) 1962 చైనా-ఇండియా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కి భారీ విజయం సాధించింది. 1965లో వచ్చిన రొమాంటిక్‌ సినిమా 'ఖాజల్‌' మరో పెద్ద హిట్‌. వీటి తర్వాత ధర్మేంద్ర వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుస సూపర్‌ హిట్లతో బాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన నటుడిగా ఎదిగారు.

Details

 హేమామాలినితో జోడీ - సూపర్‌స్టార్‌ హోదా

'మేరా గావ్‌ మేరా దేశ్‌' ద్వారా యాక్షన్‌ హీరోగానూ భారీ క్రేజ్‌ పొందారు. 1970లలో హేమామాలినితో ఆయన చేసిన సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఈ జోడీ అప్పటి బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ పెయిర్‌గా పేరొందింది. 1973 సంవత్సరం ధర్మేంద్ర కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. లోఫర్‌, జీల్‌ కె అస్‌ పార్‌, జుగ్ను వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. 1975 ఆగస్టు 15న విడుదలైన 'షోలే' భారత సినిమా చరిత్రలోనే మహత్తరమైన చిత్రంగా నిలిచింది. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఆయన చేసిన ఈ చిత్రం ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Details

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, భావోద్వేగాలు

1997లో ధర్మేంద్ర ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌, సైరా బాను చేతుల మీదుగా అవార్డు స్వీకరించినప్పుడు ఆయన భావోద్వేగాలకు లోనయ్యారు. తన దీర్ఘకాల సినీ ప్రయాణంలో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు చేసినప్పటికీ, ఒక రెగ్యులర్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకోలేకపోయాననే వ్యాఖ్య ఆయన హృదయాన్ని ప్రతిబింబించింది. రాజకీయ ప్రవేశం 1990ల నాటికి హీరో పాత్రల నుంచి క్యారెక్టర్‌ రోల్స్‌ వైపు సుళువుగా మలుపు తిప్పిన ధర్మేంద్ర, తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. భాజపాలో చేరి 2004లో రాజస్థాన్‌లోని బికనేర్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Details

నిర్మాతగా విజయాలు 

1983లో విజేత ఫిల్మ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తన పెద్ద కుమారుడు సన్నీ దేవోల్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'బేతాబ్‌' నిర్మించారు. ఆ సంవత్సరం బాలీవుడ్‌లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 1990లో నిర్మించిన 'గాయల్‌' ఏడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను దక్కించుకుని సూపర్‌హిట్‌గా నిలిచింది. 1995లో తన చిన్న కుమారుడు బాబీ దేవోల్‌ను పరిచయం చేస్తూ నిర్మించిన 'బర్సాత్‌' కూడా మంచి వసూళ్లు సాధించింది. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర 2012లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించారు. ఫిక్కీ అందించే 'లివింగ్ లెజెండ్‌', 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌', అలాగే ఫాల్కే రత్న వంటి బహుమతులు అందుకున్నారు.