
Gaddar Awards: జూన్ 14న గద్దర్ చలనచిత్ర అవార్డుల వేడుక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
తెలుగు సినిమాలతోపాటు ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహించనున్నట్టు స్పష్టం చేశారు.
గద్దర్ పేరుతో నిర్వహించనున్న తెలంగాణ చలనచిత్ర అవార్డుల గురించి ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు.
వివరాలు
తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలే ఊపిరి
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ''గద్దర్ ఒక గొప్ప ప్రజాకవి. తన పాటల ద్వారా తెలంగాణ ప్రజల హృదయాలను స్పృశించిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజల గుండెల్లో గద్దర్ పాటలు నిండి ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ఆయన శైలిని అనుసరిస్తూ పాటలు పాడటం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలే ఊపిరిగా నిలిచాయి. అలాంటి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం చాలా అభినందనీయమైన విషయం. ఈ అవార్డుల వేడుక హైదరాబాద్‌లో ఎంతో వైభవంగా జరగాలి. అవసరమైన అన్ని సాయాలు ప్రభుత్వంగా మేము అందిస్తాం'' అని పేర్కొన్నారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవం జూన్ 14న నిర్వహించనున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు.
వివరాలు
కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధ
హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇక 14 సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వం ఈ అవార్డులను మళ్లీ ప్రారంభిస్తోంది.
అవార్డుల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు.
ఆ కమిటీకి ప్రముఖ నటి జయసుధను చైర్మన్‌గా నియమించారు. మొత్తం 1248 నామినేషన్లు అందాయి.
అందులో వ్యక్తిగత విభాగంలో 1172, ఫీచర్ ఫిల్మ్స్, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, ఫిల్మ్ విమర్శలు, సినిమాలపై రచనలు వంటి విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయని ఇటీవల వెల్లడించారు.
ప్రస్తుతం ఈ నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలిస్తూ ఉన్నారు.