Grammy Awards 2024: 'గ్రామీ' అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్-జాకీర్ హుస్సేన్
భారతీయ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్‌లకు ప్రతిష్టాత్మక 'గ్రామీ' అవార్డు వరించింది. ఉత్తమ 'గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్' విభాగంలో వీరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న 'దిస్ మూమెంట్' ఆల్బమ్ గ్రామీ అవార్డును గెల్చుకుంది. ఈ ఆల్బమ్‌కు పని చేసిన మరో ఇద్దరు సెల్వగణేష్ వినాయక్రం, గణేష్ రాజగోపాలన్ కూడా అవార్డును అందుకున్నారు. గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్, గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ రెండు కెటగిరీల్లోనూ వీరు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. 'దిస్ మూమెంట్' ఈ ఆల్బమ్‌లో మొత్తం 8 పాటలు ఉన్నాయి. అన్ని సూపర్ హిట్‌గా నిలిచాయి. గ్రామీ అవార్డు అనేది సంగీతానికి ఇచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు.
గ్రామీ అవార్డ్స్ వేదికపై అదరగొట్టిన శంకర్ మహదేవన్
ప్రపంచంలోని అతిపెద్ద సంగీత పురస్కారాల్లో ఒకటైన గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం ఆదివారం రాత్రి 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు) ప్రారంభమైంది. గ్రామీ అవార్డ్స్ వేదికపై శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. ఆ తర్వాత వీరు అవార్డును అందుకున్నారు. ఈ గ్రామీ అవార్డును శంకర్ మహదేవన్ తన భార్యకు అంకితం చేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడారు. తనకు సహకరించిన కుటుంబం, స్నేహితులు, దేశానికి కృతజ్ఞతలు అని తెలిపారు. దేశం పట్ల తాను గర్వంతో ఉన్నట్లు చెప్పారు. ఈ అవార్డును తన భార్యకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు.