Grok AI: ఏఐతో హాలీవుడ్ సినిమా.. 'ఒడిస్సీ' తొలి ఎపిసోడ్‌ను విడుదల చేసిన గ్రోక్
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ సాంకేతికతతో పూర్తి స్థాయి సినిమా రూపొందిస్తామంటూ గతంలో ప్రకటించిన ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్.. తాజాగా 'ఒడిస్సీ' పేరుతో రూపొందించిన వీడియోలో తొలి 7 నిమిషాలను విడుదల చేసింది. దీనిని పూర్తి సినిమా ప్రారంభ భాగంగా కాకుండా 'ఒడిస్సీ' సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌గా సంస్థ పేర్కొంది. వండర్ స్టూడియోస్ సహకారంతో, దర్శకుడు దేవ్ వాకర్ నేతృత్వంలో ఈ వీడియో రూపొందింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఏఐ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Details
ఏఐతో సినిమా.. మస్క్ మరో ప్రయోగం
గ్రీకు పురాణ కథ 'ది ఒడిస్సీ' ఆధారంగా చారిత్రకంగా వాస్తవికతకు దగ్గరగా ఉండే పూర్తి నిడివి సినిమా రూపొందిస్తామని ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించారు.
ఆ ప్రకటన వెలువడి మూడు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు కేవలం 7 నిమిషాల వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' చిత్రంపై మస్క్ గతంలో విమర్శలు చేశారు.
సినిమాలో నాన్‌వైట్, ట్రాన్స్‌జెండర్ నటులను ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు నోలన్ సినిమాలు ఎక్కువగా నిజమైన సెట్స్, ప్రత్యక్ష చిత్రీకరణ, భారీ నటీనటుల బృందంతో రూపొందుతాయి.
Details
విజువల్స్ బాగున్నా.. కథలో పట్టు కరవు
గ్రోక్ రూపొందించిన వీడియోలో కొన్ని దృశ్యాలు నిజమైన నటీనటులు సముద్రంలో ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.
గతంలో మస్క్ పంచుకున్న కొన్ని ఏఐ వీడియోలతో పోలిస్తే ఇది మెరుగ్గా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
అయితే పురాతన గ్రీకు భాషకు బదులుగా ఇంగ్లీష్‌లో సంభాషణలు ఉండటం, బ్రిటిష్ యాసలో వినిపించే వ్యాఖ్యానం చారిత్రక వాస్తవికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ముఖ్యంగా వీడియోలో కథనం నెమ్మదిగా సాగడం, పాత్రల సంభాషణలు సహజంగా లేకపోవడం, భావోద్వేగాలు కనిపించకపోవడం ప్రధాన లోపాలుగా విమర్శకులు పేర్కొంటున్నారు.
కొన్ని షాట్లు వాస్తవికంగా ఉన్నప్పటికీ.. మొత్తం వీడియోలో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ఆసక్తి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏఐతో అద్భుతమైన దృశ్యాలను సృష్టించవచ్చేమోగాని, సినిమాకు కావలసిన భావోద్వేగాలను తీసుకురాలేదన్నది నిపుణుల అభిప్రాయం.