haiwaan movie review: 'హైవాన్'.. సైఫ్, అక్షయ్‌ల క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ కథానాయకులు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్‌లకు ఎవరి స్టార్‌డమ్ వారిదే. ఇక కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రియదర్శన్ శైలే వేరు. అలాంటి ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే అంచనాలు భారీగా ఉండటం సహజమే. ఆ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'హైవాన్'. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్‌ను పంచింది?
వివరాలు
కథేంటంటే..
శ్యామ్ రాణే (సైఫ్ అలీఖాన్) అంధుడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో కళ్లు కనిపించకపోయినా కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని జీవితాన్ని కొనసాగిస్తుంటాడు.
ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ, మెయింటెనెన్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు. కళ్లు కనిపించకపోయినా శ్యామ్ గ్రహణశక్తి మాత్రం అమోఘంగా ఉంటుంది.
అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే మాజీ న్యాయమూర్తి ప్రధాన్ (బొమన్ ఇరానీ)తో శ్యామ్‌కు పరిచయం ఏర్పడి, అతడికి దగ్గరవుతాడు.
ఎవరికీ తెలియకుండా దూరంగా పెంచుతున్న తన కుమార్తె గురించి ప్రధాన్.. శ్యామ్‌కు చెబుతాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయికి శ్యామ్ సంరక్షకుడిగా వ్యవహరిస్తుంటాడు.
వివరాలు
ఆసక్తికరంగా కథ
ఇదిలా ఉండగా.. అదే అపార్ట్‌మెంట్‌లో ఓ పెళ్లి జరుగుతుండగా, ప్రధాన్ ఫ్లాట్‌లోకి పరశురామ్ గోఖలే (అక్షయ్ కుమార్) చొరబడతాడు.
అతడు ప్రధాన్‌ను హత్య చేస్తాడు. అక్కడితో ఆగకుండా.. ఎవరికీ తెలియకుండా పెంచుతున్న ప్రధాన్ కుమార్తెను కూడా హత్య చేసేందుకు ఆమె కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు.
అసలు పరశురామ్‌కు, ప్రధాన్‌కు మధ్య ఉన్న విరోధం ఏంటి? అంధుడైన శ్యామ్.. పరశురామ్‌ను ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే 'హైవాన్' కథ.
వివరాలు
ఎలా ఉందంటే..
పై కథ చదివిన వెంటనే ఎక్కడో చూసినట్లుగా అనిపించిందా? అవును.. మలయాళ బ్లాక్‌బస్టర్ 'ఒప్పం'కు ఇది రీమేక్.
మోహన్‌లాల్ కీలక పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 'కనుపాప' పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి థ్రిల్‌ను పంచింది.
ఇప్పుడు అదే కథను అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌లతో ప్రియదర్శన్ 'హైవాన్' పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2016 సెప్టెంబరు 8న 'ఒప్పం' విడుదలైంది. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే కథ హిందీలో రీమేక్ అయి ప్రేక్షకుల ముందుకు రావడం గమనార్హం.
ప్రస్తుత ఓటీటీ యుగంలో రీమేక్ చేయకుండా ఉండటమే మేలని 'హైవాన్' మరోసారి నిరూపించింది.
వివరాలు
సినిమాలో కొత్తదనం లేదు
ఇప్పటికే అందరికీ తెలిసిన కథను సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ తమ భుజాలపై మోయడం తప్ప.. సినిమాలో కొత్తదనం మచ్చుకైనా కనిపించదు.
అంధుడైన శ్యామ్ గ్రహణశక్తి, ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే వారికి తలలో నాలుకలా వ్యవహరించే అతడి తీరును పరిచయం చేస్తూ దర్శకుడు కథను ప్రారంభించారు.
పరశురామ్ పాత్ర ఎంట్రీ ఇచ్చే వరకు కథ సాగదీతగా అనిపిస్తుంది. ముఖ్యంగా మాతృక 'ఒప్పం' లేదా తెలుగు 'కనుపాప' చూసిన వారికి ఈ భాగం మరింత బోరింగ్‌గా అనిపించే అవకాశం ఉంది. ప్రధాన్‌ను హత్య చేయడం, ఆ క్రమంలో శ్యామ్‌తో జరిగే సంఘర్షణ మొదలైన తర్వాతే కథ కాస్త గాడిలో పడుతుంది. అప్పటికి విరామం కార్డు పడుతుంది.
వివరాలు
కొద్దిగా వర్కౌట్ అయిన కామెడీ
ఇక ద్వితీయార్ధం మాత్రం పూర్తిగా థ్రిల్ మోడ్‌లో సాగుతుంది.
పోలీస్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు ప్రధాన్ కుమార్తెను కనిపెట్టేందుకు పరశురామ్ చేసే ప్రయత్నాలు, వాటిని శ్యామ్ అడ్డుకోవడం వంటి సన్నివేశాలతో కథ ముందుకు వెళ్తుంది.
'కనుపాప' చూడని వారికి ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇదే సమయంలో ప్రియదర్శన్ తన మార్కు కామెడీని కూడా పంచే ప్రయత్నం చేశారు.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా షబీర్ హష్మి తనదైన శైలిలో వినోదాన్ని పంచారు. సీరియస్‌గా సాగే కథలో ఆయన కామెడీ కొంతవరకు రిలీఫ్‌గా అనిపిస్తుంది.
క్లైమాక్స్‌లో శ్యామ్, పరశురామ్‌ల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. చివర్లో మోహన్‌లాల్ కూడా తళుక్కున మెరుస్తారు.
వివరాలు
ఎవరెలా చేశారంటే..
అంధుడైన శ్యామ్ పాత్రకు సైఫ్ అలీఖాన్ న్యాయం చేశారు. ఆయన నడక, హావభావాలు, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చక్కగా కుదిరాయి.
ప్రతినాయకుడు పరశురామ్ పాత్రలో అక్షయ్ కుమార్ తేలిపోయారని చెప్పడం కంటే.. ఆ పాత్ర ఆయనకు సరిగ్గా అతకలేదని చెప్పడం సరైనది.
ప్రతీకారం నుంచి పుట్టే కోపం, ఆవేదన ఆయన ముఖంలో సరిగ్గా ప్రతిబింబించలేదు.
బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, రాజ్‌పాల్ యాదవ్, షబీర్ హష్మి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే సినిమాలో చాలా మైనస్‌లు కనిపిస్తాయి.
ఓ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. మాతృకలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దడంతో పాటు మరింత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కొత్త వెర్షన్‌ను తీర్చిదిద్దాలి.
వివరాలు
ఎక్కువగా సాగదీత సీన్లు
అయితే 'హైవాన్' విషయంలో అలా జరగలేదు. అనవసరమైన పాటలు, సన్నివేశాలను జోడించి సినిమాను మరింత సాగదీశారు.
అందుకే దర్శకుడు ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారనడం కంటే.. ఫ్రీమేక్ చేశారని చెప్పడం సరైనదేమో అనిపిస్తుంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 'హైవాన్' కాపీ పేస్ట్ చేసినట్లుగానే అనిపిస్తుంది. అయితే మీరు 'ఒప్పం' లేదా 'కనుపాప' సినిమాలను చూడకపోతే.. 'హైవాన్'లో కొంతవరకూ ఆ థ్రిల్‌ను ఫీల్ అయ్యే అవకాశం ఉంది.
బలాలు
నటీనటులు
ద్వితీయార్ధం
బలహీనతలు
ప్రథమార్ధం
నిడివి
తెలిసిన కథే కావడం