మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్లోని ఆసక్తికర తెలియని విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా సంగీతంలో ఇళయరాజాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 1980 ప్రాంతంలో ఆయన స్వరపరిచిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
అప్పటివరకూ ఒకలా వినిపించిన సినీ సంగీతం, ఇళయరాజా రాకతో కొత్త ట్రెండ్ అందుకుంది. ఆ ట్రెండ్ లో పాటలు రావాలని ప్రేక్షకులు ఇప్పుడు కూడా అనుకుంటున్నారంటే ఇళయరాజా సంగీత ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.
ఈరోజు ఇళయరాజా బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
1943 జూన్ 2వ తేదీన తమిళనాడులోని తేని జిల్లా పన్నియపురంలో జన్మించారు ఇళయరాజా. ఆయన సంగీతం అందించిన మొదటి సినిమా అన్నాకిళి (తమిళం). 1976లో రిలీజైంది.
Details
ఇళయరాజాగా మారిన పేరు
ఇళయరాజా అసలు పేరు ఆర్ జ్ఞానదేశిగన్. మొదటి సినిమా(అన్నాకిళి) చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం, ఆయన్ని ఇళయ అని పిలిచేవారు. ఇళయ అంటే చిన్నవాడు అని అర్థం.
అప్పట్లో ఏ.యం రాజా అని మరో మ్యూజిక్ డైరెక్టర్ ఉండడంతో, రెండు పదాలను కలిపేసి ఇళయరాజా అని పెట్టేసారు.
ఇళయరాజాను ఇసైజ్ఞాని అని అంటారు. అంటే సంగీత విద్వాంసుడు అని అర్థం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన భద్రకాళి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఇళయరాజా.
ఇళయరాజా సంగీతం అందించిన తెలుగు సినిమాలు సాగర సంగమం, స్వాతిముత్యం సినిమాల్లోని పాటలు ఇప్పటికీ జనాల గుండెల్లో ఉన్నాయి.
Details
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు
ఇప్పటివరకు 1000కి పైగా సినిమాలకు సంగీతం అందించిన ఇళయరాజా, 7వేలకు పైగా పాటలకు మ్యూజిక్ చేసారు. దాదాపు 20వేల కాన్సర్ట్స్ లో పాల్గొన్నారు.
తెలుగులో సాగర సంగమం, రుద్రవీణ సినిమాలకు జాతీయ అవార్డు అందుకున్నారు ఇళయరాజా. మొత్తం ఆయన కెరీర్ లో 5జాతీయ అవార్డులు అందుకున్నారు.
2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1993లో లండన్ లో రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీ ని కంపోజ్ చేసి ఆసియాలోనే ఈ ఘనత అందుకున్న మొదటివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వంద సంవత్సరాల భారతీయ సినిమాపై 2013లో సీఎన్ఎన్ - ఐబీఎన్ నిర్వహించిన పోలింగ్ లో అద్భుతమైన సంగీత దర్శకుడిగా 49శాతం మంది ఇళయరాజాకు ఓటు వేసారు.