Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల'
యాంకర్ సుమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్లైనా అక్కడ సుమ యాంకరింగ్ చేయాల్సిందే. సుమ పుట్టినరోజు బుధవారం(మార్చి 22) కాగా, ఆమె గురించి తెలుసుకుందాం. తెలుగు నాట యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన ఘనత మాత్రం సుమకే దక్కుతుంది. పుట్టింది కేరళలోని పాలక్కాడ్‌లో అయినా.. తెలుగులో అనర్గళంగా మాట్లాడటం సుమ ప్రత్యేకత. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి, చిన్నప్పటి నుంచి తెలుగులో చదవిన వారు కూడా ఆమెలా మాట్లాడలేని పరిస్థితి. తొలినాళ్లలో ఉదయభాను, ఝాన్సీల నుంచి పోటీ ఎదురైనా తన మాటలతో స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగారు సుమ. కొత్త యాంకర్లు ఇండస్ట్రీకి వస్తున్నా.. అమె బ్రాండ్ పెరుగుతూనే ఉంది కానీ, తగ్గడం లేదు.
కొన్నేళ్లుగా రెమ్యునరేషన్‌లో సుమ టాప్
యాంకర్ సుమ ఈవెంట్ చేసినా, టీవీ షో చేసినా ఆమెకు చెల్లించే రెమ్యునరేషన్ రూ.లక్షల్లో ఉంటుంది. గత కొన్నేళ్లుగా తెలుగు యాంకర్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారి జాబితాలో సుమనే టాప్‌లో ఉంటూ వస్తున్నారు. టాలీవుడ్‌లో సుమ ఇచ్చిన డేట్ ఆధారంగా సినిమా ఈవెంట్లు జరుగుతాయని చెబుతుంటారు. ఎందుకంటే ఆమె డేట్ ఖాళీగా లేదంటే ఆరోజు ఫంక్షన్ వాయిదా పడాల్సిందే. 1995లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన సుమ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళ కార్యక్రమం సుమను మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ షో భారత్‌లో ఎక్కువ కాలం నడిచిన మహిళా గేమ్ షోలలో ఒకటిగా రికార్డు సృష్టించింది.