Hollywood: రూ.950 కోట్ల విలువైన పురాతన నగల దోపిడీపై సినిమా..ఆ పుస్తకానికి వెండితెర రూపం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా పేరొందిన పారిస్‌లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం'లో గత సంవత్సరం చోటుచేసుకున్న భారీ దోపిడీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ ఘటనలో దొంగలు సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన పురాతన ఆభరణాలను అపహరించారు. భారత కరెన్సీలో ఈ నగల విలువ రూ.950 కోట్లకు పైగానే ఉంటుంది.
వివరాలు
మ్యూజియంలోకి ప్రవేశించి దొంగతనం..
ఈ దోపిడీకి సంబంధించిన మరో ఆశ్చర్యకర అంశం ఏమిటంటే.. నిందితులు ఎలాంటి అనుమానం రాకుండా సాధారణ వ్యక్తుల్లా మ్యూజియంలోకి ప్రవేశించి, అదే ప్రశాంతతతో నగలను తీసుకుని బయటకు వెళ్లిపోయారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలను తలపించే ఈ నిజజీవిత ఘటన ఇప్పుడు సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఏఎఫ్‌పీ' (AFP) మే 26న వెలుగులోకి తీసుకొచ్చింది.
వివరాలు
స్టార్ దర్శకుడి చేతిలో ప్రాజెక్ట్..
2025 అక్టోబర్ 19న జరిగిన ఈ భారీ దోపిడీ నేపథ్యంలో ఫ్రెంచ్ జర్నలిస్టులు రచించిన 'మేయిన్ బస్సే సుర్ లే లౌవ్రే' అనే పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని సినిమా రూపొందించనున్నారు. గతంలో హాలీవుడ్ నటి అన్యా టేలర్-జాయ్ నటించిన 'సాక్రిఫైస్' చిత్రంతో గుర్తింపు పొందిన ఫ్రెంచ్ దర్శకుడు రొమైన్ గవ్రాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. అదే సమయంలో, ఒక బ్రిటీష్ నిర్మాణ సంస్థ ఈ కథ ఆధారంగా డాక్యుమెంటరీ సిరీస్ రూపొందించే హక్కులను కూడా పొందింది. ప్రముఖ ఫ్రెంచ్ పత్రికలు 'లే పారిసియన్', 'లే మోండే', అలాగే 'పారిస్ మ్యాచ్' మ్యాగజైన్‌కు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు కలిసి ఈ పుస్తకాన్ని రచించారు.
వివరాలు
లౌవ్రే మ్యూజియంలో అసలు ఏం జరిగింది?
గత సంవత్సరం అక్టోబర్ 19న కొందరు వ్యక్తులు మ్యూజియం నిర్వహణ సిబ్బంది వేషంలో లోపలికి ప్రవేశించారు. ఎవరికి అనుమానం రాకుండా భద్రతా వ్యవస్థను మోసం చేసి, వందల కోట్ల విలువైన పురాతన నగలను చాకచక్యంగా దోచుకెళ్లారు. ఈ ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంల భద్రతా ప్రమాణాలపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ దోపిడీ కారణంగా భద్రతా వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ లారెన్స్ డెస్ కార్స్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కాగా, గత ఏడు నెలలుగా ఈ కేసును విచారిస్తున్న అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు కొంతమంది కీలక అనుమానితులను అరెస్ట్ చేసినప్పటికీ, రూ.950 కోట్ల విలువైన దొంగిలించిన ఆభరణాలు ఇప్పటికీ ఎక్కడున్నాయన్న విషయం మాత్రం వెలుగులోకి రాలేదు.
వివరాలు
ఇంకా ఖరారు కాని సినిమా పేరు..
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. అయితే సినిమా టైటిల్‌ను ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు. అలాగే ఇందులో నటించే నటీనటుల వివరాలను ఈ ఏడాది చివర్లో ప్రకటించనున్నట్లు సమాచారం. కళాఖండాలు, పురాతన ఆభరణాల దొంగతనం అంతర్జాతీయ క్రైమ్ ప్రపంచంలో లాభదాయక వ్యాపారంగా మారుతోందని, ఆ చీకటి ప్రపంచంలోని వాస్తవాలను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నామని చిత్ర బృందం వెల్లడించింది.