Oscar Awards: ఆస్కార్ వెనకున్న విశేషాలు.. పేరు నుంచి ఖర్చు వరకు ఆసక్తికర విషయాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారంగా చెప్పుకునే 'ఆస్కార్' అవార్డులపై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. తెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించే కళాకారుల నుంచి, తెర వెనక కష్టపడే సాంకేతిక నిపుణుల వరకు చాలామందికి ఈ అవార్డు అందుకోవడం జీవితకాల స్వప్నంగా ఉంటుంది. అయితే ఈ ఘనమైన వేడుకకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు చాలామందికి తెలియవు. అలాంటి కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
ఆస్కార్ పేరు ఎలా వచ్చింది?
మనమంతా ఈ అవార్డును సాధారణంగా 'ఆస్కార్' అని పిలుస్తాం. కానీ దీని అసలు పేరు మాత్రం'అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్'.అకాడమీ లైబ్రేరియన్‌గా పని చేసిన మార్గరెట్ హెరిక్ ఒకసారి ఈ ట్రోఫీని చూసి,అది తన బాబాయ్ ఆస్కార్‌లా కనిపిస్తోందని వ్యాఖ్యానించారని చెబుతారు. ఆ మాట తర్వాత తర్వాత విస్తరించి, చివరకు 'ఆస్కార్' అనే పేరే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దశాబ్దాల పాటు నామినేషన్ల రికార్డు ప్రముఖ సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ ఈ అవార్డుల చరిత్రలో అరుదైన రికార్డును నెలకొల్పారు. 1968 నుంచి 2024 వరకు అనేక దశాబ్దాల పాటు వరుసగా నామినేషన్లు అందుకున్న విశిష్టత ఆయనకుంది.
వివరాలు
ఆస్కార్ ట్రోఫీని అమ్మలేరు
'స్టార్ వార్స్' వంటి గుర్తుండిపోయే చిత్రాలకు సంగీతం అందించిన ఆయన,ఇప్పటివరకు మొత్తం 54 నామినేషన్లు దక్కించుకుని అత్యధిక నామినేషన్లు పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆస్కార్ ట్రోఫీకి ఉన్న ప్రతిష్ఠ అపారమైనది. అందుకే దీనిని వేలం వేయడం లేదా విక్రయించడం అనుమతించరు. 1951 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఎవరైనా విజేత లేదా వారి వారసులు ఆ ట్రోఫీని వదులుకోవాలనుకుంటే, దానిని ముందుగా అకాడమీకి మాత్రమే ఇవ్వాలి. అది కూడా కేవలం ఒక్క డాలర్‌కు అప్పగించాల్సి ఉంటుంది.
వివరాలు
ప్రసంగాలకు సమయ పరిమితి ఎందుకు?
సాధారణంగా ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడేందుకు 45 సెకన్ల సమయం మాత్రమే ఇస్తారు. దీనికి కారణం గతంలో గ్రీర్ గార్సన్ చేసిన సుదీర్ఘ ప్రసంగమే. ఆమె ఒకసారి 5 నిమిషాల 30 సెకన్ల పాటు మాట్లాడటంతో తర్వాత సమయ పరిమితిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. అయితే 2025లో అడ్రియన్ బ్రాడీ 5 నిమిషాల 40 సెకన్ల పాటు మాట్లాడి కొత్త రికార్డును నమోదు చేశారు.
వివరాలు
తొలి వేడుకలో కేవలం 12 విభాగాలే
1929లో తొలిసారి ఆస్కార్ వేడుకలు నిర్వహించినప్పుడు కేవలం 12 కేటగిరీల్లో మాత్రమే అవార్డులు ఇచ్చారు. తర్వాత సినిమారంగం విస్తరించడంతో పాటు సాంకేతిక విభాగాలు కూడా పెరగడంతో అవార్డుల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం 24 కేటగిరీల్లో ఆస్కార్‌లను ప్రదానం చేస్తున్నారు. డాల్బీ థియేటర్‌తో ఆస్కార్‌కు ప్రత్యేక బంధం 2002 నుంచి లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు శాశ్వత వేదికగా మారింది. అప్పటి నుంచి ఎన్నో మంది సినీ ప్రముఖులు తమ కలల పురస్కారాన్ని అక్కడే అందుకుని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు.
వివరాలు
ఆస్కార్ ట్రోఫీ బరువు ఎంత?
మెరిసే బంగారు బొమ్మలా కనిపించే ఆస్కార్ ట్రోఫీ అంత తేలికగా ఉండదు. దీని బరువు సుమారు 8.5 పౌండ్లు, అంటే దాదాపు 3.8 కిలోలు ఉంటుంది. అలాగే దీని ఎత్తు 13.5 అంగుళాలు. ఉత్తమ దర్శకురాలిగా తొలి మహిళ ఆస్కార్ చరిత్రలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న తొలి మహిళ కేథరిన్ బిగెలో. ఆమె 2010లో 'ది హర్ట్ లాకర్' చిత్రానికి ఈ గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఆస్కార్ చరిత్రలో ఆమె పేరు ప్రత్యేకంగా నిలిచిపోయింది.
వివరాలు
అత్యధిక ఆస్కార్‌లు గెలిచినవారు ఎవరు?
వ్యక్తిగతంగా చూస్తే వాల్ట్ డిస్నీ అత్యధికంగా 26 ఆస్కార్ అవార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించారు. సినిమాల పరంగా చూస్తే'బెన్-హుర్'(1959),'టైటానిక్'(1997),'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్:ది రిటర్న్ ఆఫ్ ది కింగ్' (2003)చిత్రాలు ఒక్కొక్కటి 11అవార్డులు గెలుచుకుని అత్యధిక ఆస్కార్‌లు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆస్కార్ వేడుక ఖర్చు కూడా భారీదే ఆస్కార్ వేడుక ఎంత అద్భుతంగా జరుగుతుందో,దాని వెనక వ్యయం కూడా అంతే భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఒక్క రాత్రి జరిగే ఈ కార్యక్రమానికి సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. 2024 నివేదికల ప్రకారం ఈ వేడుకకు దాదాపు రూ.477 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. ఇక ఈ ఏడాది ఆ వ్యయం రూ.500 కోట్లను దాటినట్లు హాలీవుడ్ మీడియా వెల్లడించింది.