Loading...
Anil Ravipudi: త్రివిక్రమ్‌పై అనిల్ రావిపూడి ప్రభావమా?.. 'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్స్‌పై జోరుగా చర్చ!
త్రివిక్రమ్‌పై అనిల్ రావిపూడి ప్రభావమా?.. 'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్స్‌పై జోరుగా చర్చ!

Anil Ravipudi: త్రివిక్రమ్‌పై అనిల్ రావిపూడి ప్రభావమా?.. 'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్స్‌పై జోరుగా చర్చ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌తో తొలిసారి పూర్తి స్థాయి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెంకటేష్ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాలు 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు కథ, మాటలు అందించిన త్రివిక్రమ్.. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం'తో దర్శకుడిగా మరోసారి వెంకీతో చేతులు కలిపారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ముఖ్యంగా వారం రోజులు కూడా గడవకముందే వరుసగా మూడు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు విడుదల చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో త్రివిక్రమ్ తన సినిమాలకు ఈ తరహా దూకుడు ప్రమోషన్స్ చేయలేదు.

వివరాలు

వరుసగా మూడు పాత్రల పరిచయం

'ఆదర్శ కుటుంబం'లోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ త్రివిక్రమ్ ప్రత్యేక వీడియోలను విడుదల చేశారు.

ఇందులో వెంకటేష్‌ను 'చిట్టిబాబు', శ్రీనిధి శెట్టిని 'స్వర్ణ', అలాగే వెంకటేష్ కుమార్తె 'సంపూర్ణ' పాత్రలో యువికా పాధవిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఈ క్యారెక్టర్ వీడియోలు సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

వివరాలు

యువికా పాధవి ఎవరు?

తాజాగా విడుదలైన మూడో వీడియోతో వెంకటేష్ కుమార్తె పాత్రలో నటించిన యువికా పాధవి గురించి ప్రేక్షకులు ఆసక్తిగా వెతకడం ప్రారంభించారు.

చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన యువికా, 'ఉరవు కూకే కొడుప్పం' టెలివిజన్ సీరియల్ ద్వారా బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది.

అనంతరం అజిత్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'వీరమ్'లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం'లో వెంకటేష్ కుమార్తె పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT

వివరాలు

సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

'బాహుబలి' సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రధాన పాత్రలను ప్రత్యేక వీడియోల ద్వారా పరిచయం చేసిన విషయం తెలిసిందే.

అదే తరహాలో ఇప్పుడు త్రివిక్రమ్ కూడా క్యారెక్టర్ వీడియోలతో సినిమాను ప్రమోట్ చేస్తుండటం విశేషంగా మారింది.

అయితే ఈ వీడియోల మేకింగ్, డైలాగులు, ప్రమోషనల్ ప్లానింగ్‌ను చూసిన కొందరు నెటిజన్లు.. త్రివిక్రమ్ ఈసారి దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌ను అనుసరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు.

ఇక ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎప్పుడూ తన బలంగా మార్చుకుని విజయాలు అందుకున్న త్రివిక్రమ్.. 'ఆదర్శ కుటుంబం'తో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

ADVERTISEMENT