జబర్దస్త్: పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి కిర్రాక్ ఆర్పీ సాయం
జబర్దస్త్ లో కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కిర్రాక్ ఆర్పీ, ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్ లోని కర్రీ పాయింట్ ఓపెన్ చేసారు. ఈ కర్రీ పాయింట్ కి మంచి పబ్లిసిటీ రావడంతో బిజినెస్ కూడా బాగా జరిగింది. కాకపోతే డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ కావడం వల్ల చేపల పులుసు తయారు చేసే వాళ్ళు కావాలని కర్రీ పాయింట్ మూసేసి నెల్లూరు వెళ్ళిపోయాడు కిర్రాక్ ఆర్పీ. ప్రస్తుతానికి ఈ కర్రీ పాయింట్ రన్నింగ్ లో ఉంది. తాజాగా కిర్రాక్ ఆర్పీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జబర్దస్త్ ఆర్టిస్ట్ పంచ్ ప్రసాద్ కి సాయం చేస్తానని చెప్పుకొచ్చాడు. కిడ్నీ సమస్య వల్ల పంచ్ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించిందట.
రూమ్ రెంట్ నుండి కిడ్నీ సమస్య వరకూ అన్నీ తీరుస్తానంటున్న ఆర్పీ
పంచ్ ప్రసాద్ ఆరోగ్యం బాగాలేనందువల్ల చాలా కష్టపడుతున్నాడని, కనీసం ఇంటి అద్దె కట్టుకోలేని స్థితిలో ఉన్నాడని, అందుకే ఆయనకు సాయం చేస్తానని మాటిచ్చాడు. సాయం చేస్తానని మీడియా ముఖంగా చెప్పడానికి గల కారణాన్ని వివరిస్తూ, తనకు పేరు రావాలని కాదని, రేపేదైనా మాట తప్పితే మీరందరూ నన్ను తిడతారన్న భయం ఉండాలనే చెప్తున్నానని అన్నాడు. మొన్నీమధ్య పంచ్ ప్రసాద్ ఇంటికి వెళ్ళాడట ఆర్పీ. అక్కడ ప్రసాద్ పడుతున్న బాధలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నాడట. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం బాగయ్యే వరకూ ఖర్చులన్నీ భరిస్తానని చెప్పాడు. దీంతో కిర్రాక్ ఆర్పీపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆర్పీది మంచి మనసు అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.