Vijayendra Prasad: లవ్-సస్పెన్స్ నేపథ్యంలో రూపొందిన 'కళ్యాణం కమనీయం జీవితం'.. ఫస్ట్ లుక్ విడుదల..
ఈ వార్తాకథనం ఏంటి
వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'కళ్యాణం కమనీయం జీవితం'. ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించగా, పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ కథా రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ విడుదల చేయనున్నారు.
వివరాలు
టైటిల్ వినగానే ఆకట్టుకుంది: విజయేంద్ర ప్రసాద్
ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "'కళ్యాణం కమనీయం జీవితం' అనే టైటిల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. రాజవంశీ ఈ టైటిల్ గురించి చెప్పిన వెంటనే నాకు ఎంతో నచ్చింది. నిర్మాతలు మంచి కథను ఎంపిక చేసుకుని ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు. పోస్టర్‌ను చూస్తే దర్శకుడి ఆలోచన, విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి నా శుభాకాంక్షలు" అని తెలిపారు.
వివరాలు
పోస్టర్ విడుదలే విజయోత్సవంలా అనిపించింది..
దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ, "విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ విడుదల కావడం మా చిత్ర విజయానికి తొలి అడుగులా అనిపిస్తోంది. నా కథను విశ్వసించి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేమ, సస్పెన్స్ అంశాల సమ్మేళనంగా ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మొత్తం చిత్రబృందం ఎంతో నిబద్ధతతో పనిచేసింది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని తెలిపారు. 'కళ్యాణం కమనీయం జీవితం' చిత్రంలో ఖాన్ దురాని, సాహితి ఆవంచ, ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శ్రీమురళీ కార్తికేయ సంగీతం సమకూర్చగా, వెంకటరాజు డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.