Iran-Us War: మళ్లీ ఉద్రిక్తంగా మారిన పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ పరస్పరం సైనిక చర్యలకు దిగుతున్నాయి. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సమాచార ప్రసార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించగా.. ప్రతిగా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నౌకాదళం, వైమానిక దళ స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది.
వివరాలు
కార్గో నౌకపై దాడికి కూడా ఇరానే బాధ్యత..
అమెరికా, ఇరాన్ మధ్య గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ముందుగా ఇరానే ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఒక కార్గో నౌకపై దాడికి కూడా ఇరానే బాధ్యత వహించిందని పేర్కొంది. ఆ పరిణామాలకు ప్రతిస్పందనగా ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలపై లక్ష్యిత దాడులు నిర్వహించినట్లు అమెరికా వెల్లడించింది. అయితే అమెరికా చేస్తున్న ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. కార్గో నౌక ఘటనను సాకుగా చూపుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను అమెరికానే మరింత తీవ్రతరం చేస్తోందని ఐఆర్‌జీసీ విమర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది కూడా అమెరికానేనని ఆరోపించింది.
వివరాలు
అవసరమైతే సైనిక చర్యలతో ముందుకు వెళ్తాం: ట్రంప్
ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ మరోసారి ఉల్లంఘించడంతోనే అమెరికా వైమానిక దళం ఈ దాడులు చేపట్టిందని తెలిపారు. ఇరాన్ తన చర్యల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే, ఇప్పటికే ప్రారంభించిన చర్యలను సైనిక మార్గంలో పూర్తిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఇరాన్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశముందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.