Ujjwal Nikam: కేతన్ అగర్వాల్ హత్య కేసు: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంచలన కేసును సమర్థంగా నడిపించేందుకు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. పుణెలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహ్‌గఢ్ కోట సమీపంలో కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసివేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. 4 ఈ కేసులో కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్‌తో పాటు ఆమె ప్రియుడు చేతన్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.
వివరాలు
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్న న్యాయశాఖ..
తమ కుమారుడి హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కేతన్ కుటుంబ సభ్యులు శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి త్వరితగతిన తీర్పు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేయగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ.. ఈ ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైందని పేర్కొన్నారు. బాధిత కుటుంబం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసును వాదించేందుకు నికమ్ కూడా అంగీకరించారని తెలిపారు. విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయశాఖను ఆదేశించినట్లు చెప్పారు.
వివరాలు
న్యాయవాదులలో ఉజ్వల్ నికమ్‌కు ప్రత్యేక గుర్తింపు..
కేసు దర్యాప్తు, విచారణలో ఏ అంశాన్నీ విస్మరించబోమని, బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో ప్రముఖ క్రిమినల్ న్యాయవాదులలో ఉజ్వల్ నికమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసుతో పాటు అనేక సంచలనాత్మక నేర కేసుల్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆయన సేవలందించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉత్తర-మధ్య ముంబయి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.